ఈ మధ్య కాలంలో తెలంగాణలో వరుసగా జరుగుతున్న రెండో ఎన్నిక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, దీని కారణంగా నల్గొండ జిల్లాలో వేడి రాజుకుంటోంది. దుబ్బాకలో ఓడిన గులాబీ పార్టీ ఈ సీటును కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే బోలెడు ప్లాన్లు వేస్తోంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి అయిన జానారెడ్డి వీరికి అడ్డంగా నిలబడ్డారు. ఆయన సొంత నియోజకవర్గమైన ఇందులో పోయిన సారి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. వరుసగా రికార్డు హైట్రిక్ లు కొట్టిన జానాను ఇక్కడ ఓడించడం అంత సులువు కాదు.
దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలతో గులాబీ పార్టీ కాకమీదుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అధికారం దక్కాలంటే ఈ సీటు గెలవడం పక్కా.. ఓడిపోతే ఇక బీజేపీదే అధికారం అనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే దుబ్బాక జీహెచ్ఎంసీలో దున్నేసిన బీజేపీకి సాగర్ లో పెద్దగా బలం లేదు. అభ్యర్థిని నిలబెట్టడానికి సరైన క్యాండిడేట్ దొరకడం లేదు. జానారెడ్డి కొడుకునే నిలబెట్టాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో బీజేపీ గాలి ఆ పార్టీకి కలిసివస్తోంది. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి ఇప్పటికే ఖాయం కాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ఇప్పుడు సాగర్ సీటు కోసం బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల బీజేపీ నేతలు ఆయనతో రహస్యంగా భేటి అయినట్లు ప్రచారం సాగింది.
ఇక టీఆర్ఎస్ తరుఫున నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు మళ్లీ అవకాశం ఇస్తారా? లేక కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతారా అన్నది తేలాల్సి ఉంది. దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే భార్యకు టికెట్ ఇచ్చి ఓడిపోయిన టీఆర్ఎస్ ఇక్కడ దాన్ని రిపీట్ చేయవద్దని భావిస్తోంది. సాగర్ బరిలో గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నప్పరెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇక చిన్నపరెడ్డి కాకపోతే బీజేపీ తరుఫున నిలబడేందుకు నివేదితా రెడ్డి అంజయ్యయాదవ్ పోటీపడుతున్నారు. చిన్నప్పరెడ్డి కనుక టీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరితే బలమైన అభ్యర్థిగా బీజేపీ పోటీ ఇవ్వడం ఖాయమంటున్నారు. చివరికి ఎవరివైపు ఎవరుంటారో, ఎవరు గెలుస్తారో సాగర్ యుద్ధంలో… ఇంకొన్ని రోజులు ఆగితే అన్నిటికి సమాధానాలు దొరుకుతాయి.