తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ‘‘వార్ రూమ్’’ టెన్షన్

క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి తెలంగాణలో కూటమి రాజకీయాలు. రోజూ చర్చలు చేస్తున్నా కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావడంలేదు. దీంతో కూటమిలోని అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షన్ నెలకొంది. ఒకవైపు త్యాగాలకు సిద్ధపడాలంటూ ప్రకటనలు చేస్తూనే మరో్వైపు తన సీటులో కాకుండా ఎక్కడైనా త్యాగం చేయండి అన్నట్లు వ్యవహరిస్తున్నారు కూటమి పార్టీల నేతలు. దీంతో సీట్ల చర్చలు ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సీటుకు డజన్ మందికి పైగా అభ్యర్థులున్నారు. పోటీ చేయాలనుకున్న వారంతా దరఖాస్తు చేసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఆ పార్టీలో నేతలు సద్వినియోగం చేసుకున్నారు. ఎంతగా సద్వినియోగం అంటే తెలంగాణలో ఉన్నదే 119 సీట్లు అయితే 5వేలకు పైగా పోటీ చేస్తామంటూ దరఖాస్తులు అందాయి. దీంతో స్క్రీనింగ్ కమిటీ షాక్ కు గురైన పరిస్థితి ఉంది.

ఇక సీట్లు రాని కాంగ్రెస్ లీడర్ల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానమే డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగబోతున్నది. సీట్లు ఎవరికైతే రావో వారందరినీ ఢిల్లీకి పిలిపించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాట్లు చేస్తున్నది. ఎవరికైతే సీటు లేదో వారందరినీ వార్ రూమ్ కు పిలిపించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నది.  

సీట్లు రాని వారందరికీ వార్ రూమ్ లో చర్చల కోసం ఢిల్లీ నుంచి త్వరలో పిలుపు రాబోతున్నది. సీట్లు రాని నేతలెవరో పేర్లు సిద్ధం చేయాల‌ని ఎఐసిసి కార్య‌ద‌ర్శుల‌కు సూచ‌న‌ అందింది. పార్టీ నేతలంతా రెండు రోజ‌ల‌లో డిల్లీకి వెళ్ళ‌నున్నారు. వార్ రూమ్ పిలుపు వచ్చిందటే ఇక  ఆ లీడర్ కు సీటు గల్లంతే అన్న టెన్షన్ కాంగ్రెస్ ఆశావహులను పట్టి పీడిస్తున్నది. ఇదంతా నామినేష‌న్ల కంటే ముందే నేత‌ల‌కు బుజ్జిగింపులు చేసి మ్యాటర్ సెటిల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది.

టిక్కెట్లు రాని ఆశావాహుల‌కు అధిష్టానం నుంచి పిలుపు రానుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 119 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి దాదాపు 5 వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే అందులో పొత్తులో దాదాపు 25 సీట్లు పోటీ చేసే అవ‌కాశం లేకుండా పోవ‌డం, చాల సీట్లలో సామాజిక కోణం నేప‌థ్యంలో ముఖ్యులు సీట్లు కోల్పోవ‌డంతోపాటు, నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు ముగ్గ‌రు ముఖ్య నాయ‌కులు టిక్కెట్ కోసం పోటీ ప‌డుతుండ‌డంతో కాంగ్రెస్ సీట్ల ఏర్పాట్లు చాల క్లిష్టంగా మారింది. దాదాపు సీట్ల కేటాయింపులు కీల‌క ద‌శ‌గా  చేరిన నేప‌థ్యంలో సీట్లు రాని నాయ‌కులు, పొత్తుల‌లో సీట్లు కోల్పోయిన నాయ‌కులు రెబ‌ల్‌గా పోటీలు చేయ‌కుండా, అసంతృప్తితో ఎలాంటి రాజ‌కీయ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌కుండా ఉండేందుకు ముందుగానే నాయ‌కుల‌ను బుజ్జిగించి వారిని పార్టీకి ప‌నిచేసేలా చ‌ర్య‌లు తీసుకునేందుకు అధిష్టానం చ‌ర్య‌ల‌కు సిద్ధమైందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. 

ఇందుకోసం టిపిసిసి కోశాధికారి, సీనియ‌ర్ నాయ‌కులు గూడూరు నారాయ‌ణ రెడ్డిని డిల్లీకి ర‌మ్మ‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్య‌వ‌హ‌రాలు చూస్తున్న డిల్లీలోని టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఒక‌రు, ఎఐసిసి వ్య‌వ‌హారాలు చూస్తున్న ముగ్గురు కార్య‌ద‌ర్శుల‌కు ఫోన్ ద్వారా స‌మాచారం ఇచ్చి వారు ఇంచార్జ్‌లుగా బాధ్య‌తలు చూస్తున్న వారి ప్రాంతాల‌లోని అసెంబ్లీ స్థానాల‌లో పేర్ల‌ను ప‌రిశీలించి సిఫార‌సు చేయాల‌ని సూచించారు. కాగా ముగ్గ‌రు ఎఐసిసి కార్య‌ద‌ర్శులు వారి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న లీస్టుల ఆధారంగా, స‌ర్వేల ఆదారంగా టిక్కెట్ కేటాయించిన నాయ‌కుడు కాకుండా రెండో స్థానంలో ఉండే నాయ‌కుల‌ లీస్టుల‌ను సిద్దం చేసి పంప‌నున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి కుంతియా తో సంప్రదించి ఖచిత్తమైన సమాచారం ఏఐసీసీ కి పంపుతారు.. దాని ఆధారంగా వార్ రూంలో నేతలతో ఏఐసీసీ ముఖ్య నాయకులు భేటి అయ్యి వాళ్లకు హామీలు ఇస్తారు.

ఈ లీస్టుల ఆధారంగా ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ముఖ్య బాధ్య‌త‌ల‌లో ఉన్న నాయ‌కులు వీరంద‌రిని రెండు రోజుల‌లో డిల్లీకి పిలువ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఎలాంటి ప‌రిస్థితుల‌లో వారికి టిక్కెట్ ఇవ్వ‌లేక‌పోయామో, ఎలాంటి ప‌రిస్థితుల‌లో పొత్తు పెట్టుకోవాల్సి వ‌చ్చిందో చెప్పి, భ‌విష్య‌త్తులో ప్ర‌భుత్వం రాగానే ఎలాంటి ప‌దువులు ఇవ్వ‌నున్నారో, పార్టీలో ఎలాంటి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారో వారికి వివ‌రించి, పార్టీ అభ్య‌ర్థి విజ‌యానికి కృషి చేయాల‌ని కోర‌నున్నారు. ఎన్నిక‌ల‌లో రెబెల్స్‌, అసంతృప్తి వాదుల‌తో పార్టీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా, పార్టీ విజ‌యాల‌కు ఇబ్బందులు కాకుండా ఎఐసిసి చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయ‌ని పార్టీ భావిస్తుంది. 

చూడాలి… ఏం జరుగుతున్నదో???