తెలంగాణ :దుబ్బాకలో నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల వేడి రాజుకుంది. టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా తమ బలం నిరూపించుకున్నారు. ఇక కాంగ్రెస్ కూడా పోటీపోటీగానే సత్తా చాటింది.
కాంగ్రెస్ తరుఫున మాజీ ఎమ్మెల్యే ముత్తంరెడ్డి కుమారుడు బరిలో దిగాడు. ఈయన చివరి నిమిషంలో టీఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ తరుఫున నిలబడ్డాడు. టీఆర్ఎస్ తరుఫున చనిపోయిన సోలిపేట భార్య సుజాత బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో నిలిచారు. ఉద్దండులు దుబ్బాక బరిలో ఉండడంతో రాజకీయంగా వేడి రాజుకుంది. వ్యూహాలు ప్రతి వ్యూహాలతో నేతలంతా బిజీగా ఉన్నారు.
టీఆర్ఎస్ తరుఫున హరీష్ రావు మొత్తం ప్రచారాన్ని భుజానకెత్తుకున్నాడు. బీజేపీ తరుఫున రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నీ తానై నడిపిస్తున్నారు.
అయితే ఇంతమంది దుబ్బాకపై ఫోకస్ చేస్తున్నా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ ఉరఫ్ విజయశాంతి మాత్రం రాజకీయ తెరపై కనపడడం లేదు. దుబ్బాకలో రేవంత్ రెడ్డి సీతక్క వంటి వారు తిష్టవేసి ప్రచారం చేస్తున్నా రాములమ్మ విజయశాంతి మాత్రం అటువైపే చూడడం లేదు.
మెదక్ జిల్లాలో విజయశాంతికి బాగా పేరుంది. ఆమె మెదక్ ఎంపీగా గెలిచారు. మెదక్ అసెంబ్లీలో పోటీచేశారు. కాంగ్రెస్ కు చావో రేవో లాంటి ఈ దుబ్బాక పరీక్షకు మాత్రం హాజరు కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
నిజానికి మెదక్ జిల్లాతో చాలా అనుబంధం ఉన్న విజయశాంతినే మొదట దుబ్బాకలో దించాలని కాంగ్రెస్ భావించింది. కానీ స్థానిక నేతలు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని సమాచారం. మెదక్ అసెంబ్లీలో రెండు సార్లు ఓడిన రాములమ్మ గెలవదని వారంతా భావించారట.. దీంతో ప్రత్యామ్మాయంగా టీఆర్ఎస్ నేతనే చేర్చుకొని బరిలో నిలిపారు. దీంతో విజయశాంతి ఈ ఎన్నికవైపే చూడడం లేదట.. ఇక ఏఐసీసీ పదవిని ఆశించిన విజయశాంతి అదీ దక్కకపోవడంతో అలకబూనారని అందుకే దుబ్బాక ఎన్నికలకు దూరంగా ఉన్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరి ఇది నిజమా కాదా? అన్న దానిపై మాత్రం విజయశాంతి మౌనం వీడడం లేదు.