తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టిఆర్ఎస్ దుమ్మురేపింది. ఖమ్మం జిల్లా తప్ప మిగతా అన్ని జిల్లాల్లో తన సత్తా చాటింది. ప్రతిపక్ష కూటమిని మట్టి కరిపించింది. 88 సీట్లతో విజయకేతనం ఎగురవేసింది. గురువారం తెలంగాణలో రెండోసారి సిఎం గా కేసిఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 88 నుంచి 90కి చేరింది. ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా గడవకముందే టిఆర్ఎస్ గూటికి ఇద్దరు ఎమ్మెల్యేలు చేరిపోయారు. ఎవరా ఎమ్మెల్యేలు.. వివరాలు చదవండి.
తెలుగు నేల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ అనే పాలసీ ప్రారంభమైంది. అప్పుడు వైఎస్ టిఆర్ఎస్ పార్టీని చీల్చి 10 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలుగా తయారు చేశారు. వారంతా టిఆర్ఎస్ గుర్తు మీదనే గెలిచినప్పటికీ కాంగ్రెస్ కు అనుకూలంగా, టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో వ్యవహరించేవారు. అయితే వైఎస్ వారందరినీ కాంగ్రెస్ వేదికల మీద తిప్పలేదు. అలా ఆరంభమైన ఆపరేషన్ ఆకర్ష్ నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జడలు విప్పి విస్తరించి ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేస్తున్నది.
తెలంగాణ ఏర్పడిన వేళ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ 63 స్థానాలతో గెలిచి అధికారంలోకి వచ్చింది. కానీ తర్వాత పరిణామాలు ప్రమాదకరంగా మారతాయన్న ఆందోళనతో కేసిఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు. దీంతో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, వైసిపి పార్టీల ఎమ్మెల్యేలంతా బంగారు తెలంగాణ పేరుతో టిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. టిఆర్ఎస్ దెబ్బకు బిఎస్పీ శాసనసభాపక్షం, వైసిపి శాసనసభాపక్షం, టిడిపి శాసనసభా పక్షం ఆ పార్టీలో విలీనమైన పరిస్థితి ఉంది. టిడిపిలో గెలిచిన వారంతా పోగా ముగ్గురు మిగిలారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం మాత్రం కొనసాగింది. బిజెపి, ఎంఐఎం, సిపిఎం నుంచి మాత్రం సభ్యులు పోలేదు.
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై మూడేండ్లపాటు గొంతు చించుకున్న టిడిపి ఎపిలో అదే తరహా రాజకీయం షురూ చేసింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఒక ఎమ్మెల్యేకు కేసిఆర్ మంత్రి పదవి ఇస్తే ఎపిలో చంద్రబాబు నలుగురు వైసిపి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ఆపరేషన్ ఆకర్ష్ రుచి ఏంటో చూపించారు. వైఎస్ ను, ఆ తర్వాత కేసిఆర్ ను విమర్శించిన చంద్రబాబు చివరకు వారి బాటలోనే నడిచి చివరకు విమర్శలపాలయ్యారు. గొడ్డును కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నాడని విమర్శలు చేసిన నోరు మూతడింది. అదే చేత్తో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగించారు. పెద్ద సంఖ్యలో వైసిపి ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించకుండానే పార్టీలో జాయిన్ చేసుకున్నారు.
ఇక తాజా విషయానికి వస్తే టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను అధికారికంగా మొదలు పెట్టకముందే ఇద్దరు గెలిచిన అభ్యర్థులు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారు. రామగుండం ఎమ్మెల్యే గా గెలిచిన కోరుకంటి చందర్ టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. మంత్రి కేటిఆర్ ను కలిసి తాను టిఆర్ఎస్ తో కలిసి నడుస్తానని స్పష్టం చేశారు. తాను టిఆర్ఎస్ పార్టీలోనే పనిచేశానని, ఉద్యమ కాలంలో కేసిఆర్ అడుగు జాడల్లోనే నడిచానని చెప్పారు. తనకు టికెట్ ఇవ్వని కారణంగానే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినట్లు చెప్పారు. కేసిఆర్ నాయకత్వంలో పనిచేస్తానని కేటిఆర్ కు వివరించారు.
ఇక ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ ఒక్క సీటే గెలిచిందన్న ఆందోళనను పటా పంచలు చేస్తూ ఆ జిల్లాకు చెందిన తాజాగా గెలిచిన ఎమ్మెల్యే కారు ఎక్కేశారు. వైరా నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా ఎన్నికైన ఎల్.రాములు నాయక్ సైతం బుధవారం కేటిఆర్ ను కలిసి తాను టిఆర్ఎస్ తో కలిసి నడుస్తానని స్పష్టం చేశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ లో కేటిఆర్ ను కలుసుకున్నారు. ప్రమాణ స్వీకారం కాకముందే వీరిద్దరూ కారెక్కడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
మరోవైపు మరింత మంది నాయకులు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని సిఎం కేసిఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇక్కడ ఈరకమైన ప్రకటన చేశారో లేదో అక్కడ కేటిఆర్ సమక్షంలో ఇద్దరు తాజా ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ గూటికి చేరారు. ఇక ఆపరేషన్ ఆకర్ష్ మొదలు కాకముందే ఇద్దరు చేరడం చూస్తుంటే మరి ఆపరేషన్ ఆకర్ష్ మొదలైన తర్వాత ఇంకెంత మంది టిఆర్ఎస్ గూటికి క్యూ కడతారోనన్న ఆందోళన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.