బ్రేకింగ్ : టిఆర్ఎస్ లో ఎమ్మెల్యే బొడిగె శోభకు పొగ

తెలంగాణలో నిత్యం వివాదాల్లో ఉండే ఎమ్మెల్యేల జాబితాలో టిఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ కూడా ఉంటారు. ఆమె తరచూ వివాదాల్లో చిక్కుకున్నారు. టోల్ గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదం మొదలుకొని అనేక సందర్భాల్లో ఆమె వివాదాాల్లో చిక్కి వార్తల్లో నిలిచారు. ఫోన్లలో అధికారులను బెదిరించిన దాఖలాలున్నాయి. ఆ ఆడియో రికార్డులు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా చొప్పదండి కి చెందిన టిఆర్ఎస్ ముఖ్య నేతలంతా సిఎం కేసిఆర్ ను కలిసి ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేశారు. బొడిగె శోభ మీద కేసిఆర్ ను కలిసి కంప్లెంట్ చేసిన వారిలో చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, బోయినపల్లి జడ్పీటిసిలు ఇప్పనిపల్లి సాంబయ్య, వీర్ల కవిత, ఆకుల శ్రీలత, ప్రశాంతి, లచ్చిరెడ్డి, గంగాధ, బోయినపల్లి రామడుగు, కొడిమ్యాల ఎంపిపిలు బాలా గౌడ్, మాధవ్, కృష్ణారెడ్డి, స్వర్ణలత, చొప్పదండి మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గడ్డం సుమలత, మల్యాల మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, డిసిఎంఎస్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

స్థానిక ప్రజా ప్రతినిధులను బొడిగె శోభ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నేతలను అవమానకరంగా మాట్లాడుతున్నారని  ఫిర్యాదులో పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక నేతలను కలుపుకుపోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరో్పించారు. రానున్న ఎన్నికల్లో బొడిగె శోభకు టికెట్ ఇవ్వొద్దని సిఎం కేసిఆర్ విన్నవించారు. 

ఎస్.జి.ఎస్. పేరుతో సొంత సైన్యం స్థాపించుకుని ప్రజలను, ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని వారు సిఎంకు ఫిర్యాదు చేశారు. మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి పిలిచినా, గైర్హాజరయ్యారని చెప్పారు. అధికారిక కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, ఆమె భర్త పాల్గొంటే మంత్రి, ఎంపి ముందే అవమానించిన సంఘటనను వివరించారు. పేద ప్రజల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిచండంతో పాటు కేసులు  పెట్టినస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు తెలిపారు. 

ఇటీవల కాలంలో తన నియోజకవర్గంలో ఓపెనింగ్ సమయంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ చొక్కారెడ్డి కొబ్బరికాయ కొట్టబోతుండగా బొడిగె శోభ అడ్డుకున్నట్లు చెబుతున్నారు. ఆ సమయంలో ఆయన చేతిలో నుంచి కొబ్బరికాయ కింద పడిందని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి వినోద్ స్పందించి మార్కెట్ కమొటీ ఛైర్మన్ చొక్కారెడ్డి చేతికి కొబ్బరికాయ ఇచ్చి కొట్టించాడని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. 

మరోవైపు బొడిగె శోభకు కావాలని పొగ పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే చొప్పదండి నియోజకవర్గంలో పోటీ చేయాలని భావించే కొందరు టిఆర్ఎస్ నేతలు ఈ రకంగా సిఎం కేసిఆర్ కు ఫిర్యాదు చేయించారన్న చర్చ ఉంది. రానున్న ఎన్నికల్లో చొప్పదండి టికెట్ శోభకు ఇవ్వొద్దని చెప్పడం చూస్తే వేరే వ్యక్తులు ఆ సీటు ఆశిస్తున్నారని చెబుతున్నారు. సీటు ఆశించేవారే బొడిగె శోభ మీద ఉన్నవి లేనివి చెప్పి ఆమెను అవమానాలపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని బొడిగె శోభ అనుచరుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో పెద్ద వివాదంలో బొడిగె శోభ చిక్కుకున్నారు. మరి ఈ వివాదం నుంచి ఆమె ఎట్లా బయటపడతారన్నది చూడాలి.