తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన బిజెపి తన ఓటమిపై సమీక్ష చేపట్టింది. సోమవారం హైదరాబాద్ లోని ఒక హోటల్ లో తెలంగాణ బిజెపి ఎన్నికల ఇన్ఛార్జి, కేంద్ర మంత్రి జెపి నడ్డా సమక్షంలో పార్టీ నేతలు సమీక్షలు జరిపారు. ఈ సమావేశంలో ఒకరిపై ఒకరు నిందలు, విమర్శలు, ఆరోపనలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో సమావేశం వాడి వేడిగా సాగింది. సుమారు 8 గంటల పాటు ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చాయి. ఈ సమావేశంలో దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మురళీధర్ రావు, కృష్ణదాస్, రాంచందర్ రావు ఇతర సీనియర్లు హాజరయ్యారు.
సమావేశంలో కీలకమైన చర్చనీయాంశమైన వాటిలో కేంద్ర మంత్రలు ప్రగతిభవన్ కు వెళ్లి కేసిఆర్ ను కలవడం పార్టీ నేతలకు మింగుడపడడంలేదని చెప్పుకున్నారు. మోదీ మంత్రివర్గంలో ఉన్న ఒక్క దత్తాత్రేయ పదవిని ఊడబీకేసిన తర్వాత తెలంగాణ ప్రజలు బిజెపిని పారాయి పార్టీగానే చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా సమావేశంలో ఏమేమి అంశాలు చర్చకొచ్చాయో… విశ్వసనీయ సమాచారం మేరకు కింద వివరాలున్నాయి చదవండి.
కేంద్రంలో మనమే అధికారంలో ఉన్నాము. దేశవ్యాప్తంగా కొత్తగా బలపడే చాన్సెస్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. మరి అలాంటి రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది? ఉన్న ఒక్క మంత్రి పదవిని రద్దు చేశారు. కనీసం ఒక రాజ్యసభ సీటు ఇవ్వరు. ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వరు? కేడర్ ఉత్సాహంగా ఎలా పనిచేస్తారు అని పార్టీ నేతలు కేంద్ర మంత్రి నడ్డా ముందు ఆవేదన వెలిబుచ్చారు. ఉత్తుత్తి బ్యాంకు అకౌంట్లతో ఓట్లు ఎలా పడతాయనుకున్నారు అని నిలదీశారు.
ఎపిలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా ఇవ్వలేదు. దీనివల్ల తెలంగాణ ప్రజల పట్ల పార్టీ సవతి తల్లి ప్రేమ చూపుతుందన్న భావన కలిగింది. తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రులంతా ప్రగతి భవన్ కు వెళ్లి కేసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతుంటే మేము ఆ పార్టీ మీద చేసే పోరాటానికి విలువేముంది? అని ప్రశ్నించారు. నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి హర్ష వర్దన్ ప్రగతి భవన్ వెళ్లి కేసిఆర్ తో కలవాల్సిన అవసరం ఏముంది? అని అసహనం వ్యక్తం చేశారు.
కొందరు నేతలు మాట్లాడుతూ అసలు తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఏకరువు పెట్టారు. ఎన్నికల ముందు బిజెపి ఎమ్మెల్యేలు, నాయకులు ప్రగతి భవన్ వెళ్లి కేసిఆర్ తో సమావేశమై రావడం పార్టీ శ్రేణులకు, జనాలకు తప్పుడు సంకేతాలు వెళ్లాయని అందుకే చిత్తుగా ఓడిపోయామని చెప్పుకొచ్చారు. టిఆర్ఎస్ పట్ల బిజెపి నాయకత్వం సానుకూలంగా ఉందన్న భావన మన కొంప ముంచిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి 20 లక్షల సభ్యత్వం ఉండగా పార్టీకి వచ్చిన ఓట్లు 15 లక్షల లోపే రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. మన కార్యకర్తలు, మన సభ్యులే మనకు ఓటు వేయలేని పరిస్థితి ఉందని చెప్పుకున్నారు.
భయపడొద్దు, నేను చూసుకుంటా : నడ్డా
అయితే సమావేశంలో సభ్యుల ఆవేదనను ఓపికగా విన్న మంత్రి జెపి నడ్డా వారిని ఓదార్చారు. భయపడాల్సిన పనిలేదని, మీ ఆవేదనను, సూచనలను పార్టీ నాయకత్వానికి నివేదిస్తానని భరోసా ఇచ్చారు. 118 స్థానాల్లో పోటీ చేయకుండా బలంగా ఉన్న 30 -40 స్థానాల్లో పోటీ చేసి ఉంటే మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలుండేవని నడ్డా అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని సూచించారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ యంత్రాంగాన్ని కదిలించాలని పిలుపునిచ్చారు.