కొండా సురేఖ ధర్నా.. వరంగల్ లో టెన్షన్ (వీడియోలు)

వరంగల్ నగరంలో కొండా సురేఖ వర్సెస్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ మధ్య ఇంకా వివాదం రగులుతూనే ఉన్నది. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ సెంటర్ లో ఇక్బాల్ మినార్ విషయంలో స్థానికంగా ఒక సామాజికవర్గం వారు రెండుగా చీలిపోయారు. ఇందులో కొండా సురేఖ వర్గం రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. వారి ధర్నాలో కొండా సురేఖ పాల్గొన్నారు. ఆమె సైతం రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపారు.

సారే జహాసి అచ్చా గేయ రచయిత మహ్మద్ ఇక్బాల్ జ్ఞాపకంగా పోచమ్మ మైదాన్ లో కొత్తగా నిర్మిస్తున్న ఇక్బాల్ మినార్ పనులను మేయర్ వర్గానికి చెందినవారు కొందరు ధ్వంసం చేశారని కొండా వర్గం ఆరోపించింది. వెంటనే ఆ దుండగులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఇక్బాల్ మినార్ ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసేంత వరకు రోడ్డు పైన బైఠాయిస్తామని సురేఖ వర్గం వారు హెచ్చరించారు.

ఇంతలో విషయం తెలుసుకున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పోచమ్మ మైదాన్ సెంటర్ కు వచ్చి ఆందోళన కారులకు మద్దతుగా బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీసులు వచ్చి ఆందోళనను విరమింపజేశారు. సురేఖ ఆందోళన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.