బీజేపీ విషయంలో కేసీయార్ ఇంకో సెల్ఫ్ గోల్.!

తెలంగాణలో బీజేపీ వ్యూహాలకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి చిత్తయిపోతోందా.? పార్టీ ముఖ్య నేతల సమావేశంలో టీఆర్ఎస్ అధినేత కేసీయార్, ‘నా కుమార్తెను కూడా పార్టీ మారమని బీజేపీ ఒత్తిడి తెచ్చింది..’ అని చెప్పడంలో అర్థమేంటి.? తెలంగాణ రాజకీయాల్లో ఇదిప్పుడు నిజంగానే పెద్ద ‘కుదుపు’గా కనిపిస్తోంది. నిజానికి, కేసీయార్ అలా అని వుండాల్సింది కాదు. ‘ఎమ్మెల్యేలెవరూ ప్రలోభాలకు గురి కావొద్దు..’ అని కేసీయార్ సూచించడమూ, తెలంగాణ రాష్ట్ర సమితిలో కొంత కలవరానికి కారణమవుతోంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు.. అని చెప్పడం ద్వారా, ‘పార్టీ మారాలనుకున్నవారికి’ కేసీయార్ ‘భరోసా’ ఇచ్చినట్లు కనిపిస్తోందిగానీ, ఆయా స్థానాల్లో ప్రజా ప్రతినిథుల పట్ల వ్యతిరేకత వున్న దరిమిలా, కింది స్థాయి నాయకుల్లో అసహనం పెరుగుతోంది.

ఎమ్మెల్యేల కొనుగోళ్ళకు ఎర.. అంశంలో బీజేపీ కంటే టీఆర్ఎస్ ఎక్కువ నష్టపోయింది. ఎందుకంటే, ఆ వ్యవహారంలో నేరుగా బీజేపీ నాయకులెవరూ దొరకలేదు. దాంతో, అది టీఆర్ఎస్ డ్రామా.. అన్న బీజేపీ ప్రచారానికి కొంత సానుకూలత కనిపించింది. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా, అది ‘చావు తప్పి కన్ను లొట్టపోయిన’ చందమే. ముఖ్యమంత్రి సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా మునుగోడుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే వచ్చిన ఫలితం.. నానమాత్రమేనన్న భావన తెలంగాణ సమాజంలో వుంది.

అసలు తెలంగాణలో బీజేపీ జీరో.. అదీ, 2018 ఎన్నికల సమయంలో. అలాంటి బీజేపీని, కేసీయార్ ఇప్పుడు ప్రత్యర్థిగా భావిస్తున్నారంటే బీజేపీ ఎదుగుతున్నట్లే కదా.? ఇదే కదా సెల్ఫ్ గోల్ అంటే.? కాంగ్రెస్‌ని తొక్కేసి కేసీయార్ సాధించిందేమీ లేదు. ముందు ముందు తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది.. టీఆర్ఎస్ గల్లంతవుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.