ఐనవోలులో దారుణం… కోతులు చేసిన పనికి ప్రాణాలు కోల్పోయిన మహిళ…!

కొన్ని సందర్భాలలో మూగజంతువులు చేసే పనుల వల్ల ప్రజలు ప్రమాదంలో పడుతున్నారు. చాలా సందర్భాలలో వాహనాలకు కుక్కలు అడ్డు రావటం వల్ల యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాగే ఇటీవల కోతుల గుంపు చేసిన పని వల్ల ఒక మహిళ ప్రాణం పోయింది. ఈ దారుణ సంఘటన ఐనవోలులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే…
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో వరంగంటి కమలాకర్‌రెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. శనివారం రాత్రి కొన్ని కోతులు కమలాకర్ రెడ్డి ఇంటిపైకి చేరి అక్కడున్న సామగ్రిని చెల్లాచెదురు చేశాయి .

ఈ క్రమంలో ఇంట్లోకి విద్యుత్ సరఫరా ఉన్న విద్యుత్ తీగలు కూడా చెల్లాచెదురు అయ్యాయి. కమలాకర్ రెడ్డి కుటుంబసభ్యులు ఈ విషయాన్నీ గమనించలేదు. దీంతో ఆదివారం ఉదయం కమలాకర్ రెడ్డి భార్య రజిత ఇంటి వెనుక భాగంలో ఉన్న తీగలపై బట్టలు
ఆరేస్తుండగ కరెంట్ షాక్ తగిలి రజిత విలవిలలాడుతోంది. ఇది గమనించిన కమలాకర్ రెడ్డి భార్యని కాపాడటానికి ప్రయత్నం చేస్తుండగా అతనికి కూడా కరెంట్ షాక్ తగిలింది. దీంతో స్థానికులు వెంటనే కర్ర సహాయంతో కమలాకర్ రెడ్డిని కాపాడారు. దీంతో కమలాకర్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు.

కానీ రజిత మాత్రం కరెంట్ షాక్ కొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. కళ్లెదుటే కరెంట్ షాక్ కొట్టి భార్య మరణించడంతో కమలాకర్ రెడ్డి భోరున విలపించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురించి సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కోతలు చేసిన పని వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది.