సాధారణంగా ప్రస్తుత కాలంలో యువతీ యువకులు అతి చిన్న వయసులోనే ప్రేమ పేరుతో మోసపోతున్నారు. చాలామంది యువకులు ప్రేమ పేరుతో యువతుల్ని మోసం చేయడమే కాకుండా వారిని అన్ని విధాలుగా వాడుకొని పెళ్లి చేసుకోకుండా కొంతమంది వారికి అన్యాయం చేస్తుంటే మరి కొంతమంది మాత్రం పెళ్లి చేసుకుని కొంతకాలం తర్వాత వారిని వదిలేస్తున్నారు ఇలా ప్రతి ఏటా ఎంతోమంది యువతులు, మహిళలు మగవారి చేతుల్లో మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే…తుప్రాన్ మండలపరిధిలోని ధర్మరాజ్‌పల్లి గ్రామానికి చెందిన యశ్వంత్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన బాషబోయిన తేజశ్రీ (18)లు అనే యువతీ గత మూడు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అంతే కాకుండా గతేడాది అక్టోబర్ 15న పెళ్లి చేసుకొని… అక్టోబర్ 19న పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు కాపురం చేసుకుంటామని ఒప్పుకున్నారు. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత కులాల గురించి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో యశ్వంత్ రెడ్డి ఆమెను వదిలేసాడు. దీంతో కులపెద్దలు ఆ యువతికి అండగా ఆమెకు న్యాయం జరగాలని ఉండి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినా ఎలాంటి న్యాయం జరగలేదు.
దీంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ యువతీని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలా నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతీ తాజాగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని యశ్వంత్ రెడ్డి ఇంటి ముందు ఉంచి నిరసన చేపట్టారు. ఈ ఆందోళన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చి చెప్పడానికి ప్రయత్నించారు. అయినా వారి వినకపోవడంతో యశ్వంత్ రెడ్డికి తగిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో యువతీ మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.