అప్పుడే పుట్టిన ఒక శిశువు తల్లికి భారమయ్యింది. అందువల్ల పేగు తెంచుకొని పుట్టిన కన్న బిడ్డ మీద కనికరం లేకుండా పుట్టగానే అపార్ట్మెంట్ నుండి కిందకు విసిరేసింది. దీంతో శిశు తల పగిలి రక్తపుమడుగులో ఏడుస్తూ చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడ ఏరియా కమలానగర్ లో చోటు చేసుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న పసిబిడ్డను కాపాడటానికి ఎస్ఐ ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కూడా పసిబిడ్డను కాపాడుకోలేకపోయాడు.
వివరాలలోకి వెళితే…హైదరాబాద్ లోని కుషాయిగూడ ఏరియా కమలానగర్ లోని ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో నెత్తుటి మరకలతో ఉన్న పురిటిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తూ ఉండటం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సాయికుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బిడ్డను చేతుల్లోకి తీసుకుని చూడగా తలకు గాయమై రక్తం కారడం గమనించాడు. దీంతో పసిబిడ్డను ఎలాగైనా రక్షించాలన్న ఉద్దేశంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అక్కడ పసిబిడ్డను పరీక్షించిన వైద్యులు శిశువు పరిస్థితి విషమంగా ఉందని వైద్యం చేయటం తమ వల్ల కాదని చేతులెత్తేశారు.
దీంతో వెంటనే ఏఎస్‌రావునగర్‌లోని మరోక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఉన్న డాక్టర్లు కూడా తమకి చేతకాదని.. నిలోఫర్‌కు తరలించమని సూచించారు. దీంతో ఎస్సై హుటాహుటిన పసిబిడ్డను తీసుకొని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పసిబిడ్డను వెంటిలేటర్ పై ఉంచి దాదాపు 5 గంటల పాటు చికిత్స అందించారు. అయితే పసిబిడ్డతలకు బలంగా గాయం కావడంతో ఐదు గంటలు చికిత్స తీసుకున్న తర్వాత మరణించినట్లు ఎస్సై సాయికుమార్ వెల్లడించాడు. అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఇలా దారుణంగా విసిరేసిన వారి జాడ గురించి తప్పకుండా తెలుసుకుంటామని..సీసీ కెమెరాల ఆధారంతో బిడ్డను ఎవరు వదిలారనే వివరాలను తెలుసుకుంటామని ఆయన తెలిపారు.