RTC Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Driver Shramik Recruitment 2025

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్, శ్రామిక్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆశావహ అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 28వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీ.

1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్, ఆటో ఎలక్ట్రిషియన్, పెయింటర్, వెల్డర్, అప్ హోల్స్టర్, మిల్‌రైట్ మెకానిక్) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. 22 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న పురుషులు, మహిళలు డ్రైవర్ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. పదో తరగతి లేదా తత్సమాన పరీక్ష తప్పనిసరిగా ఉత్తీర్ణత అయి ఉండాలి. నోటిఫికేషన్‌ తేదీ నాటికి 18 నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్‌ మోటారు వెహికిల్‌ లేదా హెవీ గూడ్స్‌ వెహికిల్‌ లేదా రవాణా వెహికిల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.

ఇక శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఐటీఐ(మెకానికల్- డీజిల్/మోటర్ వెహికల్) పాస్ అయ్యి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు.. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఫిజికల్‌ మెజర్‌మెంట్, మెడికల్, డ్రైవింగ్‌ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.

డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు ఫీజు రూ.600గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, స్థానిక అభ్యర్థులకు రూ.300 కట్టాలి. శ్రామిక్ పోస్టుకు రూ.400 ఫీజు ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, స్థానిక అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. డ్రైవర్‌ ఉద్యోగాలకు రూ.20,960-60,080, శ్రామిక్‌ పోస్టులకు రూ.16,550-45,030 పేస్కేల్‌ ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.tgprb.in వెబ్‌సైట్ సందర్శించిండి.