తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8న ఫైబర్‌నెట్ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు. రూ.300కే అందించే ఈ సేవల ద్వారా గ్రామీణ ఇళ్లకు అత్యాధునిక ఇంటర్నెట్, టెలివిజన్, టెలిఫోన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఫైబర్‌నెట్ కనెక్షన్ ద్వారా 20Mbps వేగంతో ఇంటర్నెట్ లభించనుంది. ఈ సౌకర్యంతో టీవీని కంప్యూటర్‌గా ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులకు ఈ ప్రణాళిక ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. పాఠశాలలు, గ్రామీణ కార్యాలయాలకూ ఫైబర్‌నెట్ సేవలు అందించనున్నారు. అంతేకాకుండా, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ కమాండ్ సెంటర్లకు అనుసంధానం చేయబడుతుంది.
మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో ఫైబర్‌నెట్ సేవలు అమలవుతాయి. దశలవారీగా రాష్ట్రంలోని మిగిలిన 63 లక్షల గ్రామీణ ఇళ్లకు ఈ సౌకర్యాన్ని విస్తరించనున్నారు. ఈ ప్రణాళికకు కేంద్రం ‘భారత్ నెట్’ పథకం కింద రూ.2,500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌నెట్ ప్రాజెక్టును ప్రారంభించింది.
గ్రామీణ ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ఈ పథకం గ్రామీణ ప్రాంతాల డిజిటలైజేషన్‌కు నాంది పలుకుతోంది. ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు, టెలిఫోన్, ఓటీటీలను ఈ కనెక్షన్ ద్వారా సులభంగా వినియోగించుకోవచ్చు. ఈ పథకం పట్ల గ్రామీణ ప్రజల్లో భారీ ఆశలు నెలకొన్నాయి