కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలోని జంగారెడ్డిపల్లిలో పోలింగ్ బూత్‌ను పరిశీలించడానికి వెళ్లిన ఆయన పై దుండగులు దాడి చేశారు. దాడిలో వంశీచందర్ రెడ్డికి గాయాలయ్యాయి. కడుపు, గుండె ప్రాంతాలలో బలంగా కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో జంగారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ చెందిన వారే ఈ దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్తితి ఏర్పడింది. వంశీ చందర్ రెడ్డి పై దాడులకు పాల్పడిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.
వంశీ చందర్ రెడ్డికి వీహెచ్ పరామర్శ
కాంగ్రెస్ నేత వంశీ చందర్ రెడ్డి పై దాడి గురించి తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నిమ్స్ ఆస్పత్రిలో వంశీచందర్ రెడ్డిని పరామర్శించారు. దాడి సంఘటన గురించి అడిగి తెలసుకున్నారు. దాడిని ఆయన ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. వంశీ చంద్ రెడ్డిని ఆంధ్రా నేతలు కేవిపి రాంచందర్ రావు, గిడుగు పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన పరిస్థితి తెలుసుకున్నారు.
వంశీ మీద దాడే జరగలేదు : బిజెపి
వంశీచందర్ రెడ్డి పై అసలు దాడి జరుగలేదని బిజెపి నేతలు తెలిపారు. వంశీ చందర్ రెడ్డి కారులో వెళ్లి ఆ తర్వాత సానుభూతి కోసమే డ్రామా ఆడుతున్నాడని వారు విమర్శించారు. ఇది వంశీ పన్నిన విషపూరిత కుట్ర అని వారు ఆరోపించారు. వీడియోలలో చాలా స్పష్టంగా ఉందని బిజెపి నేతలపైనే కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారన్నారు.