SLBC Tunnel: SLBC టన్నెల్ రెస్క్యూ.. చివరి దశలో కీలక మార్పులు!

SLBC టన్నెల్‌ ప్రమాదానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్‌ మళ్లీ ఉత్కంఠ భరితంగా మారింది. వారం రోజులుగా నిరంతరం కొనసాగుతున్న సహాయక చర్యలు ఇప్పటికీ పూర్తవ్వలేదు. ప్రస్తుతం 13.5 కిలోమీటర్ల దగ్గర నీటి ప్రవాహం, బురద సమస్యలు తీవ్రంగా ఎదురవుతున్నాయి. రెస్క్యూ బృందాలు నాలుగు షిఫ్టుల్లో పనిచేస్తున్నా, అసలు ముద్దుగా మారిన మట్టి తొలగించడం కష్టంగా మారింది. కన్వేయర్ బెల్ట్‌ పనిచేయకపోవడంతో పనులు మరింత ఆలస్యం అవుతున్నాయి. సాయంత్రానికి రిపేర్ పూర్తి అయితే మిషన్‌ వేగంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ స్థితిలో రెస్క్యూ ఆపరేషన్‌ను మరింత సమర్థంగా చేయడానికి టీబీఎం మిషన్‌ను పూర్తిగా కట్‌ చేయాల్సి ఉంది. అదనంగా, మట్టి తొలగించే పనులను ముమ్మరం చేస్తున్నారు. జీపీఆర్ ద్వారా గుర్తించిన నాలుగు ప్రాంతాల్లో బురద 5 నుంచి 12 మీటర్ల లోతులో పేరుకుపోయింది. ఇప్పటికే 9 మీటర్లు తవ్వినా, TBM మిషన్‌ భాగాలు మాత్రమే లభించాయి. మిగతా ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మొత్తం 70 మంది నిపుణులు పని చేస్తున్న ఈ ఆపరేషన్‌కు మరో 48 గంటల సమయం పట్టొచ్చని అంచనా.

ఇప్పటికే మృతి చెందిన ఎనిమిది మందిలో నలుగురు TBM ముందుభాగంలో, మరొనాలుగురు 7 మీటర్ల లోతులో కూరుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మట్టిని తొలగించేందుకు సింగరేణి కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరో 15 గంటల్లో మృతదేహాలను వెలికి తీయాలని రెస్క్యూ బృందాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో NDRF, SRDF, రాట్ హోల్ మైనర్స్, ఆర్మీ, నేవీ బృందాలు పనిచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్షంగా టన్నెల్‌ను పరిశీలించి, సహాయక బృందాలకు పలు సూచనలు చేశారు. అవసరమైతే రోబోల సహాయాన్ని తీసుకోవాలని, ప్రమాదకర పరిస్థితుల్లో మానవీయ నష్టం జరగకుండా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ నిపుణుల సాయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 48 గంటల్లో రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తవుతుందా? లేక మరింత సమయం పడుతుందా? అనే అంశంపై అందరిలో ఉత్కంఠ కొనసాగుతోంది.

కన్నప్ప షేక్|| Cine Critic Dasari Vignan Review On Kannappa Teaser || Prabhas || Manchu Vishnu || TR