Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరిగ్గా ఏడాది కావడంతో పెద్ద ఎత్తున విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇలా ఏడాది కాలంలో ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు పరిచామంటూ ఇటీవల విజయోత్సవ కార్యక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బిజెపి బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ని మించిపోయాడని ఈమె ఎద్దేవా చేశారు. ఈయన అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇలా ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఈమె ఫైర్ అయ్యారు.తులం బంగారం, రూ.4 వేల పెన్షన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500 సాయం చేస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం పై ఉందని, పాలమూరు నిధుల కోసం ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు అందరూ అడుక్కున్నట్టే ఉంది అంటూ ఈమె రేవంత్ పాలన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.