Telangana: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన లఘుచర్ల భూ సేకరణ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్లు మొదట్లో రేవంత్ రెడ్డి సర్కార్ తెలియచేశారు. ఈ కంపెనీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ అధికారులు భూ సేకరణ కోసం లగచర్ల గ్రామానికి వెళ్లడంతో అక్కడ రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇక రైతులు ఏకంగా కలెక్టర్ పై కూడా దాడి చేయడంతో ఈ దాడి వెనుక బిఆర్ఎస్ నాయకులు ఉన్నారంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతులు అది కూడా గిరిజన రైతులు కావడంతో ఈ విషయంపై రేవంత్ రెడ్డి సర్కార్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లగచర్ల ఘటనలో ఈయన ఇటీవల మాట్లాడుతూ అక్కడ ఏర్పాటు చేసేది ఫార్మా కంపెనీ కాదని ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాట మార్చారు. దీంతో భారీగా వ్యతిరేకత వచ్చింది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ మరో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి.
లగచర్ల ఘటనలో భాగంగా భూసేకరణను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇలా భూ సేకరణ రద్దు చేసుకోవడంతో ఇక ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ విషయంపై మొదటి నుంచి కూడా బిఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసినదే .పచ్చని పంటలు పండే పొలాలను రేవంత్ రెడ్డి తన అల్లుడికి కానుకగా ఇవ్వడం కోసమే ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయబోతున్నారు అంటూ విమర్శలు చేశారు. అయితే చివరికి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకడుగు వేసింది.