తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మునుగోడు ఉపఎన్నిక ఫలితం అంతుచిక్కటం లేదు. ఒక్కో సర్వే ఫలితాలు ఒక్కో పార్టీకి అనుకూలంగా ఉండటంతో ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఏ పార్టీ సభ జరిగినా అన్ని సభలలో ప్రజలు ఎక్కువ సంఖ్యలోనే కనిపించడం గమనార్హం. అయితే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు దాదాపుగా లేవని రాజకీయ విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది ఏ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారనే విషయాన్ని సైతం వెల్లడించడానికి ఇష్టపడటం లేదు. అలా వెల్లడిస్తే ఇతర పార్టీలు డబ్బులు ఇవ్వవేమో అని ఓటర్లు భావిస్తున్నారు. ప్రధాన పార్టీలు భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తూ ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తుండటం గమనార్హం. కొంతమంది ఓటర్లు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థుల ముందు కొన్ని హామీలను ఉంచారని తెలుస్తోంది.
ఆ హామీలను ఎవరైతే నెరవేరుస్తామని మాట ఇస్తారో వాళ్లకే ఓటు వేస్తామని తేల్చి చెప్పారని సమాచారం అందుతోంది. కొంతమంది ఓటర్లు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థులు ఇస్తున్న వాగ్దానాలు నమ్మశక్యంగా లేవని ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాకు మంచి చేసిన వాళ్లకు మాత్రమే ఓటు వేస్తామని మరి కొందరు చెబుతున్నారు.
మునుగోడు ఉపఎన్నికలో తెరాస గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో తెరాస అధికారంలో ఉండటం కూడా ఉపఎన్నిక ఫలితంపై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ, తెరాస పార్టీలలో ఏ పార్టీ మునుగోడులో అధికారంలోకి వస్తుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.