పోలీసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు త్వరలోనే మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే పోలీసు శాఖను ప్రక్షాళన చేసి భారీగా జీతాలు పెంచడంతో పాటు సకల సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. ఏ శాఖలో జరగనంత రిక్రూట్ మెంట్ పోలీసుశాఖలో జరిపి సిబ్బంది పై పని భారాన్ని తగ్గించింది. తాజాగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా పోలీసులకు షిఫ్టు పద్దతి తీసుకు వచ్చేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. అన్ని ఫలిస్తే మరో రెండు నెలల్లోనే షిఫ్టు పద్దతితో పాటు వీక్లీ ఆఫ్ కూడా అమలు కానుంది.

తెలంగాణ పోలీసు సిబ్బందిని లక్ష మందికి పెంచడమే టార్గెట్ అని ఇటీవల హోంమంత్రి, డిజిపి ప్రకటించారు. ప్రస్తుతం 18 వేల పోస్టుల నియామకానికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. దీనితో పాటు మరో 12 వేల పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం , పోలీస్ బోర్డు చర్యలు చేపట్టింది. ఆరు నెలల్లో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. 18 వేల నియామక భర్తీ పూర్తి అయితే 88 వేలకు పోలీస్ శాఖ సిబ్బంది చేరుకుంటుంది. దీంతో వెంటనే ఆరు నెలల్లో 12 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వేసి భర్తీ చేసి 1 లక్షకు సిబ్బందిని పెంచనున్నారు. అంటే మరో ఆరు నెలల్లో పోలీసు శాఖ నుంచి మరో నోటిఫికేషన్ రానుంది. 

పోలీసింగ్ మెరుగుపడాలంటే షిఫ్టు పద్దతి మెరుగైనదని బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సంస్థ, ఆస్కీ సంయుక్త అధ్యయనంలో తేలింది. సెలవులు లేకుండా నిరంతరం పని చేయడం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా పోలీసులు అనారోగ్యం పాలవుతున్నారని సర్వే తేల్చింది. బిపి, షుగర్, ఊబకాయం, గుండెపోటు వంటి రోగాలకు పోలీసులు గురవుతున్నారని సర్వే తన నివేదికలో తెలిపింది. అదనపు గంటలు పని చేసిన సిబ్బందికి అదనపు అలవెన్స్ లు ఇవ్వాలని, రవాణా భత్యాలు కూడా ఇవ్వాలని తెలిపింది. ఎనిమిది గంటల డ్యూటి, వీక్ ఆఫ్ ఇవ్వడం వల్ల పోలీసులు మానసికంగా ఉండడంతో పాటు ధృడంగా ఉంటారని సర్వే వెల్లడించింది.  ఇవన్నీ అమలు చేయడం ద్వారా పోలీసు శాఖలో అవినీతి కూడా తగ్గిపోయి పోలీసులంతా నిజాయితీగా పని చేసే  అవకాశం ఉందని సర్వే తేల్చింది. 

సర్వే నివేదికను పూర్తి స్థాయిలో అమలు చేేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కమిషనర్లు, జిల్లా ఎస్పీల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. నివేదిక అమలు చేయడం సాధ్యమవుతుందా, అమలు చేయాలంటే ఎంత మంది సిబ్బంది ఉండాలి అనే దానిపై వివరాలు రాబడుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఈ ప్రయోగాన్ని అమలు చేసి విజయవంతమైన అసెంబ్లీ ఎన్నికల నుంచి దీనిని రద్దు చేశారు. పంచాయతీ ఎన్నికలు, పార్లెమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ విధానం పూర్తిగా అమల్లోకి రానుందని తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న నూతన విధానం పై పోలీసు సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా పోలీసుల సమస్యలను గుర్తించినందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేయాలని వారు కోరారు.