తెలంగాణను చెత్త బుట్టలో పడేసిన కేసీయార్.!

అవసరం తీరిపోయింది.. తెలంగాణని కేసీయార్ చెత్తబుట్టలో పడేశారు.! తెలుగు రాష్ట్రాల్లో.. అందునా, తెలంగాణలో జరుగుతోన్న చర్చ ఇది.! ఏ తెలంగాణ కోసమైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందో, ఆ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగాక, తెలంగాణ రాష్ట్ర సమితితో పనేముంది.? కాదు కాదు, ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అనే పేరుతో పనేముంది.? వరుసగా రెండు సార్లు ఇదే పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చారు గులాబీ బాస్ కేసీయార్.

రోజులు మారాయ్.! జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుడు వ్యవహారం కోసం కేసీయార్, తెలంగాణను వదిలించుకున్నారు.. అదేనండీ, తెలంగాణ అనే పేరుని వదిలించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేటి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా మారింది. కేసీయార్ ఈ మేరకు తెలంగాణ భవన్‌లో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నిర్వహించేస్తారట.

సో, ఇకపై జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పెయ్యడానికి కేసీయార్‌కి మార్గం సుగమం అయినట్లే లెక్క. మరి, తెలంగాణ సెంటిమెంట్ సంగతేంటి.? దాన్ని రాజేయడానికి కేటీయార్, కవిత, హరీష్ రావు తదితరులు వుండనే వున్నారాయె.! అవసరమైనప్పుడు, అవసరమైన విధంగా తెలంగాణను వాడేస్తారు.

మారింతి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మాత్రమే.. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడికీ పోదు, ఆ సెంటిమెంట్‌కి పేటెంట్ హక్కులు కేసీయార్ దగ్గరే వున్నాయనీ, వుంటాయనీ గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేసీయార్ జాతీయ వైఖరి ఏంటి.? రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా నీటి పంచాయితీపై దేశ్ కా నేతా కేసీయార్ ఎలా పెద్ద మనసు చాటుకుంటారు.? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, జాతీయ రాజకీయాలు చేస్తానని కేసీయార్ అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.