తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. దెబ్బ మీద దెబ్బ తగిలి కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతున్నది. శాసనమండలిలో కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణం బంద్ అయ్యేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది టిఆర్ఎస్ పార్టీ. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీని శాసనమండలిలో చావుదెబ్బ తీసింది టిఆర్ఎస్ పార్టీ. శాసనమండలి ఛైర్మన్ కు అధికార టిఆర్ఎస్ పార్టీ ఎక్కువ సమానం, ప్రతిపక్ష కాంగ్రెస్ తక్కువ సమానం అన్న ఫార్ములాను సద్వినియోగం చేసుకున్నది టిఆర్ఎస్. ఇక మరికొద్దిరోజుల్లో తెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాత్రమే ఉండబోతున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా శాసనమండలిలో కనుమరుగు కానున్నది. పూర్తి వివరాలు ఇవీ.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు శాసనమండలిలో షబ్బీర్ అలీ పార్టీ ఎల్పీ నేతగా ఉన్నారు. ఆయనతోపాటు ఆ పార్టీకి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ కుమార్, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ అధికారిక సభ్యులు. వీరిలో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి మినహా మిగిలిన నలుగురు షాకింగ్ డిషిషన్ తీసుకున్నారు. వారంతా శుక్రవారం ఉదయం శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ను కలిసి తమ వర్గాన్ని టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని లేఖ ఇచ్చారు. గతంలో టిడిపి సభ్యులు కూడా ఇలాగే లేఖ ఇచ్చిన దాఖలాలున్నాయి. అంతేకాకుండా గతంలో టిడిఎల్పీ మొత్తానికి మొత్తం టిఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ అసెంబ్లీలో లేఖ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది.
ఆకుల లలిత, ఎంఎస్ ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్ నలుగురు తమ వర్గాన్ని టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని లేఖ ఇవ్వడం చూస్తే వీరి వర్గం పెద్దది కాబట్టి శాసనమండలి ఛైర్మన్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆకుల లలిత, సంతోష్ కుమార్ ఇద్దరు కూడా గురువారమే సిఎం కేసిఆర్ ను కలిసి అభినందనలు తెలిపారు. ఇంతలోనే కాంగ్రెస్ కు మింగుడుపడని నిర్ణయం తీసుుకన్నారు. ఇది తెలంగాణ కాంగ్రెస్ కు భారీ దెబ్బ కాబోతున్నట్లు చెప్పవచ్చు.
నిజానికి కూచుకుళ్ల ప్రభాకర్ రెడ్డి మీద అనర్హత వేటు వేయాలని రెండు రోజుల క్రితం శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ మండలి పక్ష నేత షబ్బీర్ అలీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే అంతకుముందే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని టిఆర్ఎస్ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వారు చేసిన వెంటనే కాంగ్రెస్ కూడా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మీద ఫిర్యాదు చేసింది. అయితే ఆ నలుగురిలో కొండా మురళి, యాదవ రెడ్డి, భూపతిరెడ్డి తోపాటు గవర్నర్ నియమించిన రాములు నాయక్ కూడా ఉన్నారు. కానీ వారి నలుగురి మీద టిఆర్ఎస్ ఫిర్యాదు చేయడం, వెంటనే వారికి నోటీసులు జారీ చేయడం చక చకా జరిగిపోయాయి. కానీ శాసనమండలి ఛైర్మన్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డికి మాత్రం నోటీసులు జారీ చేసిన దాఖలాలు లేవు.
ఈ పరిస్థితుల్లో శాసనమండలిలో తమ వర్గాన్ని టిఆర్ఎస్ లో కలపాలంటూ లేఖ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇక వారిని టిఆర్ఎస్ లో కలిపితే కాంగ్రెస్ కు మిగిలేది ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రమే. వారు కూడా మార్చిలో రిటైర్ కాబోతున్నారు. ఏది ఏమైనా మార్చి నుంచి తెలంగాణ కాంగ్రెస్ కు శాసనమండలిలో సభ్యత్వం ఉండబోదని తేలిపోతున్నది.
అయితే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ అనర్హత వేటు వేసే చాన్సెస్ ఉన్నాయి. మరి గవర్నర్ కోటాలో అపాయింట్ చేయబడిన రాములు నాయక్ పై కూడా ఛైర్మన్ అనర్హత వేటు వేస్తారా? లేదా అన్నది ఆసక్తికరం గా మారింది.