తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఆంధ్రప్రదేశ్‌లో హంగామా.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హంగామా రోజురోజుకీ పెరుగుతోంది. కార్తీక మాసం కావడంతో వనభోజనాలు కాస్తా, తెలంగాణ ఎన్నికల కోణంలో షురూ అవుతుండడం ఒకింత ఆశ్చర్యకరమైన పరిణామం.

సరిహద్దు ప్రాంతాల్లో కార్తీక వనభోజనాల్ని ఆయా రాజకీయ పార్టీలు, వాటి జెండాల జాడ లేకుండా అత్యంత వ్యూహాత్మకంగా ఏర్పాటు చేస్తున్నాయి. ఇంతేనా.? ఇంకా చాలా వుంది. కుల సంఘాల సమావేశాలు జరుగుతున్నాయ్. తెలంగాణలో ఆయా ప్రాంతాల్లో ప్రభావితం చూపగల ఓటు బ్యాంకు చుట్టూ రాజకీయాలు షురూ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే తెలంగాణ రాజకీయ నాయకుల హడావిడి తెరవెనుకాల కనిపించిందో, ఇప్పుడు అదే జోరు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోంది.

తెలంగాణలో అధికార భారత్ రాష్ట్ర సమితికి, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ నేతల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతున్నాయి. కొందరు అభ్యర్థులకు ప్రధాన ఆర్థిక వనరుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, పార్టీలకతీతంగా వ్యవహరిస్తున్నారు.

ఏపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు, తెలంగాణలో ఏకంగా మూడు పార్టీలకు చెందిన నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు నడుపుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఆయా నియోజకవర్గాల్లో వేర్వేరు పార్టీలకు చెందిన నేతలకు ఆర్థికంగా అండదండలు అందిస్తున్నారట.

‘ఏదో స్నేహం కోసం..’ అని సదరు నేత సన్నిహితులు చెబుతున్నా, ‘ఇదో టైపు వ్యాపారం..’ అనేవారూ లేకపోలేదు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న దరిమిలా, ముందు ముందు మరిన్ని సిత్రాలను చూడబోతున్నాం తెలంగాణ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ హంగామాకి సంబంధించి.