కేటిఆర్ తీసుకొస్తే హరీష్ మనిషిగా వెళ్లిపోయిన కొండా సురేఖ

తెలంగాణ ఉద్యమ కాలంలో ఏటికి ఎదురీదిన చరిత్ర కొండా దంపతులది. తాము నమ్మిన పార్టీ కోసం, తాము నమ్మిన నేత కోసం వారు ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణకు ఎదురు నిలిచారు. మానుకోటలో తెలంగాణవాదులపై దాడులు చేశారు… తెలంగాణవాదుల దాడులు ఎదుర్కొన్నారు. వైసిపి అధినేత జగన్ కోసం తమ ప్రాణాలిచ్చేందుకైనా వెనుకాడలేదు. కానీ జగన్ ఎప్పుడైతే సమైక్యవాదం అందుకున్నారో అప్పుడే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు సురేఖ దంపతులు. 

ఉద్యమ కాలంలో వైసిపిలో ఉన్నందున ఒక సమయంలో సురేఖ కేసిఆర్ మీద, హరీష్ రావు మీద, కోదండరాం మీద పరుషమైన కామెంట్స్ చేశారు. తెలంగాణ కోసం వీరెవరూ చావలేదెందుకు అని నిలదీశారు. బూతు మాటలతో తిట్ల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్ కోసం మంత్రి పదవికి, తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ తర్వాత జరిగిన ఉప  ఎన్నికల్లో పరకాలలో సురేఖ మీద మొగులూరి భిక్షపతి గెలిచి సంచలనం సృష్టించారు. 

ఇక వైసిపి యూ టర్న్ తీసుకోవడంతో ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత కొండా దంపతులను టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. వారే చేరారా? వీరే పిలిచారా అన్నది పక్కన పెడితే ఆ సమయంలో కేసిఆర్ తనయుడు కేటిఆర్ కొండా సురేఖను టిఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మంత్రి పదవి ఇస్తామన్నారు. బసవరాజు సారయ్యను ఓడించాలంటే సురేఖ రావాల్సిందే అని రిక్వెస్ట్ చేశారు. ఆ సమయంలో కొండా సురేఖ రావడాన్ని హరీష్ రావు వ్యతిరేకించారు. కొండా దంపతులు తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర పడ్డారు, మనల్ని పరుష భాషలో తిట్టారు కాబట్టి వారిని పార్టీలోకి తీసుకుంటే నష్టమే తప్ప లాభం లేదని హరీష్ రావు వాదించినట్లు చెబుతారు.

ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కొండా సురేఖ

కానీ టిఆర్ఎస్ అవసరం కొండా ఫ్యామిలీకి, కొండా ఫ్యామిలీ అవసరం టిఆర్ఎస్ కు కావాల్సి వచ్చింది కాబట్టి కారెక్కేశారు. తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కొద్దిగొప్ప సీట్లతోనే అధికారంలోకి వచ్చినా తర్వాత గులాబీ ఆకర్ష్ పెట్టి అన్ని పార్టీల వారిని టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. కానీ కొండా సురేఖకు ఇచ్చిన హామీ విస్మరించారు కేసిఆర్ కేటిఆర్. మంత్రి పదవి ఇస్తామని ఆశ పెట్టారు కానీ నాలుగున్నరేళ్ల కాలంలో ఆ ముచ్చటే మాట్లాడలేదని సురేఖ వెల్లడించారు కూడా.

నాలుగేళ్ల కాలంలో కేసిఆర్ ఒక్కసారి కూడా ముఖాముఖి కలిసే అవకాశం ఇవ్వలేదని కొండా దంపతులు చెప్పారు. ఇక తనను పార్టీలోకి తీసుకొచ్చిన కేటిఆర్ కూడా ఏడాది కాలంగా తమను కలవడం లేదని, అపాయింట్ మెంట్ లభించడంలేదని అన్నారు. పైగా తన నియోజకవర్గంలో మేయర్ నన్నపనేని నరేందర్ ను పాగా వేసేలా, తమకు పొగ పెట్టేలా ప్రయత్నిస్తున్నారని వారు గుర్రుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే కొండా దంపతులకు షాక్ ఇచ్చారు కేసిఆర్. 105 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించినా సిట్టింగ్ అయిన సురేఖ పేరును పెండింగ్ లో ఉంచారు. దీంతో వారు టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.

హరీష్ రావుకు ఇబ్రహింపూర్ లో స్వాగత సన్మానం నాటి ఫొటో

అయితే కొండా దంపతులు పోతూ పోతూ టిఆర్ఎస్ లో సీనియర్ నేత అయిన హరీష్ రావు మీద బాంబు వేసి వెళ్లిపోయారు. తాము హరీష్ రావు వర్గమే అని వెల్లడించారు. టిఆర్ఎస్ లో హరీష్ వర్గాన్ని తొక్కేస్తున్నాని ఆరోపించారు. మేము హరీష్ వర్గం కాబట్టి రేపటినాడు హరీష్ తోటే మమ్మల్ని తిట్టిస్తాడు కేసిఆర్ అని కూడా కామెంట్స్ చేశారు. కొండా దంపతులు చసిన ఈ కామెంట్స్ తో టిఆర్ఎస్ లో అత్యంత ఇరకాటంలో పడింది మాత్రం హరీష్ రావే అన్న చర్చ ఉంది.

ఎందుకంటే హరీష్ రావు కు టిఆర్ఎస్ లో పొమ్మనలేక పొగ పెడతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత 15 రోజులుగా నమస్తే తెలంగాణలో హరీష్ రావు వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. జోన్ పేజీకి పరిమితం చేశారు. గత వారం రోజులుగా టి న్యూస్ టివిలో కూడా హరీష్ రావు వార్తలేం రావొద్దని ఆదేశాలు అందాయి. ఈ పరిస్థితుల్లో కొండా సురేఖ మరో బాంబు లాంటి కామెంట్స్ పేల్చి పోవడం టిఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది.

అయితే ఎప్పుడైతే కొండా దంపతులకు కేసిఆర్, కేటిఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఉన్నారో అప్పటి నుంచి వారు హరీష్ తో కలవడం స్టార్ట్ చేశారు. ఏదైనా నియోజకవర్గ పని ఉంటే కేసిఆర్, కేటిఆర్ కలవనీయడంలేదు కాబట్టి హరీష్ ను కలిసి పని చేయించుకున్నారు. ఇలా పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకించిన హరీష్ రావే కొండా దంపతులకు తన పరిధిలో ఉన్న పనులు చేశారని చెబుతున్నారు. టిఆర్ఎస్ లో కేసిఆర్, కేటిఆర్ దరికి చేరలేని వారంతా హరీష్ రావు వద్దకు వెళ్లే సాంప్రదాయం ఉంది. ఇలా కొండా దంపతులు కూడా హరీష్ వర్గంగా మారిపోయారు. దానికి కారణం వారికి కేసిఆర్ కానీ, కేటిఆర్ కానీ అపాయింట్ మెంట్ దొరకకపోవడమే తప్ప ఇంకో కారణం కాదని అంటున్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న కొండా దంపతులు

ఇలా వారు బయటకు వెళ్లే సమయంలో తాము హరీష్ వర్గం అని ప్రకటనలు గుప్పించడంతో హరీష్ రావు మరింత ఇరకాటంలోకి నెట్టబడ్డారేమోనన్న చర్చ అయితే టిఆర్ఎస్ లో నెలకొన్నది.టిఆర్ఎస్ లోలోపల ముచ్చట్లన్నీ కొండా దంపతులు ఓపెన్ చేయడంతో హరీష్ రావుకు టిఆర్ఎస్ లో పొగ పెడుతున్నారని కార్యకర్తలందరికీ తెెలిసిపోయినట్లైందని అంటున్నారు.  కొండా దంపతులు పోతూ పోతూ రేపిన వివాదం నుంచి హరీష్ ఎట్లా బయటపడతారన్నది చూడాలి.