జానారెడ్డికి మిర్యాలగూడలో కాంగ్రెస్ క్యాడర్ షాక్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సిఎల్పీ నాయకుడు కె. జానారెడ్డికి మిర్యాలగూడలో ఊహించని షాక్ తగలింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆయనకు చుక్కలు చూపించారు. జానారెడ్డి దళిత, గిరిజన వ్యతిరేకిగా మారిపోయిండని మండిపడ్డారు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు. జానారెడ్డి అగ్రవర్ణ అనుకూలమైన నాయకుడు అంటూ మండిపడ్డారు. దీంతో కార్యకర్తల తాకిడి తట్టుకోలేక జానారెడ్డి అలిగి పోవాల్సి వచ్చింది. మిర్యాలగూడ స్థానిక కాంగ్రెస్ నేతలు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి.

ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో అందరు నాయకుల మాదిరిగానే జానారెడ్డి కూడా కలలు కన్నారు. తనకు, తన కుమారుడు రఘు వీర్ రెడ్డికి పోటీ చేసే అవకాశం వస్తుందని ఆశ పడ్డారు. తాను నిన్నటి వరకు ప్రాతినిథ్యం వహించిన నాగార్జున సాగర్ లో తన కొడుకు రఘుకు సీటు ఇప్పించుకుని పోటీకి దింపాలనుకున్నారు. తాను మిర్యాలగూడలో పోటీ చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం చెక్ పెట్టింది. దీంతో అందరు నాయకుల మాదిరిగానే జానారెడ్డికి కూడా ఇబ్బంది తలెత్తింది. కుటుంబానికి ఒక్క సీటు అనే పాలసీ జానారెడ్డి ఆశలకు గండికొట్టింది. దీంతో తానే నాగార్జున సాగర్ లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు జానారెడ్డి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యామిలీ… ఒక సీటు అన్న పాలసీ ఫాలో అఃవుతుందని తేలిపోవడంతో మిర్యాలగూడలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిర్యాలగూడలో 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున పోటీ చేసిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అక్కడ భాస్కర్ రావుకే టిఆర్ఎస్ టికెట్ ఫైనల్ చేసింది. దీంతో తనకు టిఆర్ఎస్ లో పోటీ చేసే చాన్స్ లేదని తేలిపోవడంతో అలుగుబెల్లి టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరిపోయారు.

ఇదిలా ఉంటే శనివారం మిర్యాలగూడలోని ఎంవిఆర్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జానారెడ్డి హాజరయ్యారు. జానారెడ్డితోపాటు ఇటీవల టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో పూర్వకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలొ పనిచేస్తూ ఉన్న నాయకులు, కార్యకర్తలు నిరసన స్వరం వినిపించారు. జానారెడ్డికి చెమటలు పట్టించారు. జానారెడ్డికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించిన వారిలో దామరచర్ల జెడ్పీటిసి శంకర్ నాయక్ తో పాటు కాంగ్రెస్ మిర్యాలగూడ నేత స్కైలాబ్ నాయక్ ఇద్దరూ ఉన్నారు.

మిర్యాలగూడ అమృత ను పరామర్శించిన జానారెడ్డి (ఫైల్ ఫొటో)

వారిద్దరూ, వారి వర్గం జానారెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జానారెడ్డిని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో తాము ఎప్పటినుంచో పనిచేస్తున్నా కొత్తగా వచ్చిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డికి టికెట్ ఎలా ఇప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టికెట్ ఇచ్చే అంశం తన పరిధిలో లేదని జానారెడ్డి వారితో వాదించారు. అయినా వారు వినలేదు. టికెట్ ఇప్పించే చాన్స్ లేకపోతే అలుగుబెల్లిని ఎందుకు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారని నిలదీశారు. జానారెడ్డి దళిత, గిరిజన వ్యతిరేకిగా మారాడంటూ విమర్శల వర్షం కురిపించారు. ఒక ఫ్యామిలీ, ఒక సీటు అన్న పాలసీ అలమలవుతుందని తేలడంతో అలుగుబెల్లిని జానారెడ్డే తీసుకొచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారి ఆగ్రహం చవిచూసిన జానారెడ్డి తట్టుకోలేక ఫంక్షన్ హాల్ లో ఒక గదిలో కూర్చుండిపోయారు. కొద్దిసేపటి తర్వాత జానారెడ్డి ప్రచార రథం అక్కడికి వచ్చింది. దీంతో కొందరు కార్యకర్తలు ఆ ప్రచార రథం ఫ్లెక్సీని చింపేశారు. నిరసన తీవ్రతరం కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. తర్వాత వివాదం సద్దుమణిగింది.

అయితే మిర్యాలగూడ టికెట్ అంటూ కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాల్సి వస్తే పార్టీ కోసం పనిచేసిన జెడ్పీటిసి శంకర్ నాయక్ కు ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. రాత్రికి రాత్రి అగ్రవర్ణాలను తీసుకొచ్చి టికెట్లు ఇస్తే పనిచేయడానికి తామేమైనా బానిసలమా అని వారు నిలదీశారు. అంతేకాకుండా తెలంగాణ జన సమితి పార్టీకి మిర్యాలగూడ సీటు అప్పగిస్తున్నారని తెలిసి మరింత ఫైర్ అయ్యారు గిరిజన నేతలు. జన సమితి నుంచి విద్యాధర్ రెడ్డికి టికెట్ రావొచ్చని ప్రచారం జరిగింది. దీంతో వారు సీరియస్ అయ్యారు. అయితే సొంత పార్టీ అగ్రవర్ణ నేత, లేదంటే కూటమి పార్టీలో అగ్రవర్ణ నేతలు తప్ప తాము కనబడడం లేదా అని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి టికెట్ ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్ అనుచరులు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన జానారెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకత్వానికి గట్టిగానే తాకిందని పార్టీలో చర్చ సాగుతున్నది.