మునుగోడులో కొత్త ఓట్ల కలకలం.. తెరవెనుక ఉన్నది ఆ పార్టీనేనా?

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ నెలలో మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లకు అన్ని రాజకీయ పార్టీల నుంచి ఓటుకు 30,000 రూపాయల మొత్తం అందనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం నేపథ్యంలో మునుగోడులో కొత్త ఓట్ల కలకలం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. కొత్త ఓట్ల కోసం ఏకంగా 23,000 దరఖాస్తులు రావడం గమనార్హం. భారీ సంఖ్యలో దరఖాస్తుల నేపథ్యంలో ప్రతి కొత్త దరఖాస్తుకు ఫైల్ కట్టి వివరాలు రాయాలని ఆదేశాలు జారీ కావడం గమనార్హం.

అయితే భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ కారణమని సమాచారం. తెలంగాణలో టీ.ఆర్.ఎస్ అధికారంలో ఉండగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలలో ఒక పార్టీ వల్లే ఈ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని సమాచారం అందుతోంది. గతంలో కూడా తెలంగాణలో ఉపఎన్నికలు జరగగా అప్పుడు వచ్చిన దరఖాస్తులతో పోల్చి చూస్తే ప్రస్తుతం 15 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు రావడం గమనార్హం.

మునుగోడుకు సమీపంలో ఉన్న నియోజకవర్గాల ప్రజలు డబ్బుపై ఆశతో మునుగోడులో ఓటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొత్త ఓట్ల దరఖాస్తుల విషయంలో ఎన్నికల అధికారులు సైతం ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని సమాచారం అందుతోంది. బీజేపీ, టీ.ఆర్.ఎస్ నేతలు కొత్త ఓట్ల దరఖాస్తుల విషయంలో ఒక పార్టీ నేతలు మరో పార్టీపై ఆరోపణలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

మునుగోడులో నామినేషన్లకు ఈ నెల 14వ తేదీ చివరి తేదీగా ఉంది. కొత్త ఓట్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ నెల 14వ తేదీ చివరి తేదీ కాగా ఆ సమయానికి కొత్త ఓట్ల దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. మునుగోడులో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎన్నికల్లో విజయం సాధించే పార్టీ ఏదో చూడాల్సి ఉంది.