టిఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడరు. కేసిఆర్ తోపాటు కేసిఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా హరీష్ రావు పైనా విమర్శల వర్షం కురిపించారు. హరీష్ ను కేసిఆర్ పార్టీ నుంచి వెళ్లగొట్టడం ఖాయమని బాంబు పేల్చారు. అంతేకాదు టిఆర్ఎస్ లో యజమానులకు, పనివాళ్లకు మధ్య యుద్ధం నడుస్తోందని ఆరోపణలు చేశారు. మీడియాతో రేవంత్ అనేక అంశాలపై మాట్లాడారు. ఆయనేమన్నారో కింద చదవండి.
విభజన సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చింది కేంద్ర ప్రభుత్మే. ఆ సందర్బంగా పార్లమెంట్ లో చర్చించి పలు హామిలు ఇచ్చారు. 5సంవత్సరాలు ప్రత్యేక హోదా… పోలవరం… నిధులు.. ముంపు గ్రామాల విలీనం పై జరిగిన చర్చలో… కేసీఆర్ , కేశవరావు లు కూడా ఉన్నారు. 7 మండలాల బదలాయింపు జరగకుండా కాంగ్రెస్ ఆపింది. కానీ ప్రధానిగా మోడీ, తెలంగాణ కు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే… ఆర్డినెన్స్ తో 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ కు బడలాయించారు తప్ప కాంగ్రెస్ హయాంలో కాదు. ఇప్పుడు వినోద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ కారణమని ఆరోపించటం దారుణం. అసలు పార్లమెంటులో ఏం జరిగిందో వినోద్ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు.
టిఆర్ఎస్ పార్టీలో యజమానులకు, పని వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోంది. ఇందులో ఎవరు విజేతలవుతారో కాలమే నిర్ణయిస్తుంది. సభా వేదికగా కవిత ఎపి ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించారు. హరీష్, వినోద్ వ్యతిరేకించారు. ఇందులో ఎవరిది తెరాస వాదన? ప్రత్యేక హోదా విషయం లో కాంగ్రెస్ పార్టీ వైఖరి అడగటం వెనక ఆంతర్యం ఏంటి? రాష్ట్రంలోప్రత్యక్షంగా, కేంద్రంలో పరోక్షంగా అధికారంలో వుంది. మీరు వైఖరి చెప్పకుండా మమ్మల్ని అడుగుతారా? మా వైఖరి అంటారా….. సోనియా మాట, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయమే మా వైఖరి. ప్రత్యేక హోదా తీర్మానమే ఫైనల్. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మా నిర్ణయాల్లో మార్పు ఉండదు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చేందుకు తలుపులు మూసి, లైవ్ లు కట్ చేసి ఆందోళన ను అడ్డుకుని బిల్ పాస్ చేసిన ఘనత కాంగ్రెస్ దే. తెలంగాణ వచ్చినప్పుడు టిఆర్ఎస్ కు ఉన్న ఇద్దరు ఎంపీలతో బిల్లు పాస్ కాలేదని గుర్తుంచుకోవాలి. ఐటి కంపెనీల వల్లే హైదరాబాద్ కు ఆదాయం వచ్చింది. వాటిని తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. టీఆరెస్ పార్టీనే కాదు. కేసీఆర్ కుటుంబం కూడా దిక్కుమాలినది. హరీష్ ను త్వరలోనే కేసీఆర్ పార్టీ నుండి గెంటేయడం ఖాయం. కాంట్రాక్టు లో మామ 10శాతం అల్లుడు రెండు శాతం గిల్లుతున్నారు. ప్రత్యేక హోదాపై కేసీఆర్ ,కేటీఆర్ ,కవిత ,హరీష్ లకు ఒక్క మాట ఉండదా ..? ప్రత్యేక హోదా పై సిడబ్ల్యూసి నిర్ణయమే మాకు శీలా శాసనం. నా పై ఎంతమంది ‘రావు’ లు కేసులు పెట్టినా భయపడను. నా పై ఎన్ని కేసులు పెట్టినా సరే కేసీఆర్ దోపిడీని ప్రశ్నిస్తూనే ఉంటా.