కాళేశ్వరం రీ డిజైన్ గుట్టు ఇదే : జెఎసి సభలో రేవంత్

కాళేశ్వరం ఎత్తిపోెతల ప్రాజెక్టు లాభమా? నష్టమా అన్న అంశంపై తెలంగాణ జెఎసి ఛైర్మన్ రఘు హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, రిటైర్డ్ ఇంజనీర్లు, మేధావులు, సాగునీటి రంగ ఎక్స్ ఫర్ట్స్ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ తరుపున మాట్లాడిన రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను లేవనెత్తారు. రీ డిజైనింగ్ గుట్టు ఇదేనంటూ ఆయన వివరణ ఇచ్చారు. రేవంత్ మాట్లాడిన మాటలు కింద ఇచ్చాము.

1977లో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. 950 టీఎంసీల గోదావరి నీరు తెలంగాణకు హక్కుగా ఇవ్వాల్సి ఉంది. పది వేల కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి కాకముందు కేసిఆర్ ఏనాడూ రీ డిజైన్ పై మాట్లాడలేదు. ప్రభుత్వం వచ్చిన తరవాత కూడా చాలా రోజుల వరకు మాట్లాడలేదు. ఆయన సిఎం హోదాలో ప్రాణహిత చేవేళ్ళకు జాతీయ హోదా ఇవ్వాలని కేంధ్రానికి లేఖ కూడా రాశారు. ఆ తరువాతే ఈ ప్రాజెక్టును ఉన్నది ఉన్నట్లు కడితే తన ఫ్యామిలీకి ఎలాంటి లాభం లేదని రీ డిజైన్ అంశాన్ని తెర ముందుకు తీసుకు వచ్చారు. జనాల నెత్తిన భరించలేనంత భారం మోపి మీరు ఎవరూ మాట్లాడవద్దంటే ఎవరూ ఊరుకోరు.

అనేక కమిటీల అధ్యయనం తరువాత మహరాష్ట్రలో భూమి ఎంత మునుగుతుంది అధ్యయనం చేశారు. 152 మీటర్ లలో అయితే 1857 ఎకరాలు మునుగుతుంది అని కమిటీలు తేల్చాయి. దానికి నష్టపరిహారం ఇవ్వాలి. అప్పుడు మహారాష్ట్ర లో ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రాజెక్టు ఆలస్యమైంది. మహారాష్ట్ర కు ఎకరాకు కోటి ఇచ్చినా 1800 కోట్లే ఖర్చయ్యేది. అలా కాకుండా రీడిజైన్ ను ముందుకు తీసుకు వచ్చారు కేసిఆర్. గోదావరిపై నిర్మించే బ్యారేజీల అధ్యయనం కోసం కేసీఆర్ సాగునీటి రంగ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వేశారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టడం వయబులిటీ కాదని అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి కమిటీ రిపోర్టు ఇచ్చింది. మిడ్ మానేరు నుండే నీరు ఎల్లంపల్లికి పోతాయి కాబట్టి మేడిగడ్డ కంటే తుమ్మడి హట్టి వద్ద బ్యారేజీ నిర్మాణమే వయబులిటి అని రిపోర్టులో ఇచ్చారు. ఇంజనీర్ల కష్టాన్ని తప్పుపట్టడం లేదు. తెలంగాణను కాపాడేందుకు వారు కృషి చేశారు.

85లక్షల ఎకరాలు ఇప్పటికే సాగు చేసేందుకు నీరు రెడీగా ఉందని కేసీఆర్ నే చెప్పారు. ఇప్పుడు  మళ్ళీ రెండు లక్షల రూపాయలతో హడావిడిగా టెండర్లు పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది. అన్ని ప్రాజెక్టుల్లో ఆయకట్టు ఓవర్ ల్యాప్ చేసి చూపిస్తున్నారు. అభివృద్ది, సంక్షేమం కోసం మాత్రమే ప్రాజెక్టులు కడతారు. గతంలో ఎప్పుడు ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు ప్రజల నుండి వసూలు చేయలేదు. ప్రాజెక్టులు సరైన పద్ధతిలో కడితే కేంద్రమే గ్రాంటులు ఇస్తుంది. కానీ కేసీఆర్ రిడిజైన్ వెనుక అవినీతి , కుంభకోణాలు దాగి ఉన్నాయి. బ్యాంకర్లను మేనేజ్ చేసి కింది ఆయకట్టును తాకట్టు పెడుతున్నారు. తెలంగాణాను శాశ్వతంగా లక్ష మీటర్ల గుంతదీసీ పాతిపెడుతున్నాడు కేసిఆర్. కాళేశ్వరం రీడిజైనింగ్ వల్ల తక్కువలో తక్కువ రెండు లక్షల కొట్ల రూపాయలు ఖర్చవుతాయి. కేసీఆర్ ఫ్యామిలీకి ప్రాజెక్టుల్లో చేకూరుతున్న లబ్ధి ఎంత? కార్పోరేషన్ పేరుతో తెచ్చిన నిధులను తిరిగి వసూలు చేస్తదా లేదా చెప్పాలి.

జిల్లాకో వెయ్యి కోట్లు పెడితే ప్రతి ఇంటికీ నీరందించవచ్చు. హైదరాబాద్ చుట్టూ రిజర్వాయర్లు కట్టి మళ్ళీ పైపులు ఎందుకు వేస్తున్నారు. ఏ పైపుల కంపెనీకి లబ్ది చేకూర్చేందుకు ఈ పైపులైన్లు వేస్తున్నారు. ఆంధ్రా కాంట్రక్టర్లకు యాభైవేల మంది తెలంగాణ బిడ్డలను పిలిపించి సభ పెట్టి సన్మానం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏనాడైనా తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ బిడ్డలకు పిలిచి పలకరించావా కేసిఆర్? బ్లాక్ లిస్ట్ లో పెట్టి జైలుకు పంపాల్సిన కాంట్రాక్టర్ ను పిలిచి షాలువా కప్పి సన్మానం చేయాల్సిన అవసరం ఏంటి? ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఉంది… కాని ప్రాజెక్టుల పేరుతో వేలకోట్ల రూపాయలు ఏ ఒక్కరి జేబులోకి వెళ్ళకుండా కాపాడాల్సిన బాధ్యత రిటైర్డ్ ఇంజనీర్లపై ఉంది. ఇప్పుడు సమాధానం చెప్పకపోయినా ఇంటికి వెళ్ళాక అయిన మేం చెబుతున్న అంశాలపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.