తెలంగాణలో ఎన్నికల సందడి మొదలై చాలా రోజులే అయ్యింది. అయితే నోటిఫికేషన్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కిపోతుంది. ఈ సమయంలో అధికార బీఆరెస్స్ ఇప్పటికే మొత్తం అభ్యర్థులతోపాటు మేనిఫెస్టోనూ ప్రకటించేసి.. ప్రచారాలు హోరెత్తించేస్తుంది. మరోపక్క 55 మందితో తొలి విడత జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ కూడా ప్రచారంలో ముందూ పోతోంది. ఈసమయంలో బీజేపీ.. జనసేనతో పొత్తు పెట్టుకుంది. దీంతో ఈ పొత్తు విషయంపై రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు.
తెలంగాణలో అధికార బీఆరెస్స్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ… బీజేపీ – జనసేన పొత్తుపై స్పందించింది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన మాత్రమే ఎందుకు ఏకంగా ప్రజాశాంతి పార్టీ అని ఒకటి ఉందిగా.. కేఏ పాల్ తోనూ పొత్తు పెడుతుంటే చాలా బాగుంటుంది అని రేవంత్ రెడ్డి స్పందించారు. దీంతో ఇప్పుడూ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి.
వాస్తవానికి ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ ఎవరూ పవన్ కల్యాణ్ ని సీరియస్ పొలిటీషియన్ అనుకోరనేది రాజకీయవర్గాల్లో ఉన్న చర్చ! ఈ సమయంలో రేవంత్ మరీ ఇంతలా పవన్ కళ్యాణ్ణి ఆయన పార్టీని తీసి పక్కన పడేశారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మాటాలతో కేఏ పాల్ కి పవన్ కి పోలిక పెట్టి ఇద్దరి స్థాయీ ఒక్కటే అని రేవంత్ చెప్పేసారా అని సెటైర్లు కూడా పడుతున్నాయి.
అయితే ఈ వ్యాఖ్యలపై కేఏ పాల్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. కేఏ పాల్ తో పవన్ పార్టీని పోల్చడం సరికాదని చెబుతున్నారు. కేఏ పాల్ ప్రజాశాంతి తరఫున మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడం.. తెలంగాణాలో తిరుగుతుండటం.. వీలు కుదిరినప్పుడళ్లా అధికార బీఆరెస్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారని గుర్తుచేస్తున్నారు.
కానీ పవన్ కల్యాణ్ అలా కాదని… తెలంగాణ రాజకీయాల్లో పవన్ పాత్ర శూన్యం అని చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ జనసేన ఏ ఎన్నికల్లోనూ పోటీచేయలేదని.. కనీసం ఏ రాజకీయ అంశ్సంపైనా స్పందించలేదని.. ఎలాంటి పోరాటాలూ చేయలేదని అంటున్నారు! అలాంటి జనసేనను… ప్రజాశాంతిపార్టీతో పోల్చడం సరికాదని హితవు పలుకుతున్నారు.
ఇన్ని తెలిసినా బీజేపీ.. జనసేనతోనే మరి ఎందుకు పొత్తుపెట్టుకుంది అనే ప్రశ్నకు కూడా ప్రజాశాంతి పార్టీ ఫ్యాన్స్ వద్ద సమాధానం ఉందని చెబుతున్నారు. బీజేపీకి తెలంగాణలో ఒక క్రౌండ్ పుల్లర్ కావాలని, కేవలం ఆ ఒక్కకారణంతోనే తెలంగాణలో జనసేన సున్నా అని తెలిసినా బీజేపీ పొత్తు పెట్టుకుందని.. ఇదే సమయంలో ఏపీలో టీడీపీ-జనసేన పొత్తులపై కూడా పరోక్షంగా ప్రభావం చూపించేలా అడుగులు వేసిందని అంటున్నారు.
ఆ సమర్ధన అలా ఉంటే… రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మాత్రం పవన్ కల్యాణ్ కు పెద్దపనే పడిందని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా… కేఏ పాల్ – పవన్ ఒక్కటి కాదు అని నిరూపించాల్సింది తెలంగాణా ఎన్నికలే అని చెబుతున్నారు. ఇందులో కచ్చితంగా జనసేన ఒక్క సీటులో అయినా గెలిచి.. తనకూ కేయే పాల్ కీ తేడా ఉందని పవన్ నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు!
ఏది ఏమైనా… ఈ తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటులో అయినా విజయం దక్కించుకుని… కేఏ పాల్ వేరు పవన్ కల్యాణ్ వేరు… రాజకీయాల్లో పవన్ లెవెల్ వేరు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి!