Renu Desai: ఆ భూమిని వదిలేయండి సీఎం గారూ.. రేణు దేశాయ్ ఎమోషనల్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల ప్రకృతి భూమిని పరిరక్షించాలని నటి రేణు దేశాయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేసిన ఆమె… పర్యావరణ పరిరక్షణకు ఈ భూములు ఎంతో కీలకం అని తెలిపారు.

“నాకు ఇప్పుడు 44 ఏళ్లు. రేపో మాపో ఈ లోకాన్ని వదిలేస్తాను. కానీ నా పిల్లలకు, మన భవిష్యత్తు తరాల పిల్లలకు ఆక్సిజన్, మంచి నీరు అవసరం. దాన్ని మనం ఇప్పటి నుంచే కాపాడాలి,” అంటూ భావోద్వేగంగా చెప్పారు. అభివృద్ధి జరగాలి కానీ, అలాంటి అభివృద్ధికి ఈ బహుమూల్యమైన భూమిని తాకట్టు పెట్టొద్దని సూచించారు.

తనకు దగ్గరలోని స్నేహితులు ఈ వీడియో చేయవద్దని చెప్పినప్పటికీ, తల్లిగా తన మనస్సాక్షి ఆమెను దీనికి ప్రేరేపించిందని రేణు పేర్కొన్నారు. “పిల్లల భవిష్యత్తు కోసం మనం డబ్బు, విద్య, ఆహారంపై శ్రద్ధ పెడతాం. కానీ ఇవన్నీ ఉన్నా, శ్వాస తీసుకోలేని పరిస్థితి వస్తే లాభం ఏమిటి?” అని ప్రశ్నించారు.

ఈ వీడియోలో ఆమె మొక్కలు, అడవులు, జంతువులు, పక్షుల అవసరం గురించి మాట్లాడారు. ప్రాణుల హక్కులను గుర్తుంచుకుంటూ, ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. చాలామంది నెటిజన్లు రేణు దేశాయ్‌కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. “మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రకృతి పరిరక్షణ తప్పనిసరి” అంటూ ఆమె అభిప్రాయాన్ని అందరూ సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.