బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. నాలుగు విడతల పాదయాత్ర విజయవంతంగా పూర్తి కాగా, అడుగడుగునా పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నా బండి సంజయ్ ఉక్కు సంకల్పంతో ముందుకెళుతున్నారు. అయితే, ఐదో విడత పాదయాత్రకు సంబంధించి మరింతగా ప్రభుత్వం ఆంక్షల తీవ్రతను పెంచుతోంది. సున్నితమైన ప్రాంతం కావడంతో, ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన సభకు అనుమతి లేదంటూ పోలీసులు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
కేసీయార్ నియంత పాలనకు ఇదే నిదర్శనం..
కేసీయార్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.? అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్రకు వెళతానంటే అడ్డుకుంటామని పోలీసులు అనడం సబబు కాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ‘రేపటి సభకు వెళ్ళి తీరతాం.. న్యాయస్థానం తలుపు తడతాం..’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాగా, గతంలో కూడా బండి సంజయ్ పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే, న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఊరట పొందారు.
మొత్తమ్మీద, తెలంగాణలో బీజేపీ – టీఆర్ఎస్ మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. అడ్డుకోలేమని తెలిసీ, కేసీయార్ సర్కారు.. బండి సంజయ్ పాదయాత్రకు అడ్డు తగలడం ద్వారా, తెలంగాణలో బీజేపీ ఇమేజ్ పెంచుతూ వస్తున్నారన్నమాట. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి, బీజేపీని తమ రాజకీయ ప్రత్యర్థిగా ఎంచుకున్న కేసీయార్.. వచ్చే ఎన్నికల్లో అందుకు తగ్గ ప్రతిఫలం అందుకోబోతున్నారా.? అయితే, అది ఏ రకంగా వుండబోతోంది.? వేచి చూడాల్సిందే.