కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ లో కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తల దాడులతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఖానాపూర్ కేంద్రంలో పోలింగ్ ను పరిశీలించేందుకు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి పొన్నం ప్రభాకర్ అక్కడికి వచ్చారు. ఆయన చాలా సేపు పోలింగ్ బూత్ లను సందర్శిస్తూ అక్కడే ఉన్నారు. ఇదే సమయంలో టిఆర్ఎస్ నాయకులు పొన్నంకు అంత సమయం ఇక్కడే పని అంటూ పోలీసులతో గొడవకు దిగారు.
ఇదే సమయంలో డిప్యూటి మేయర్ గుగిళ్లపు రమేష్ అక్కడకు చేరుకున్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలు రమేష్ కు విషయం చెప్పి టిఆర్ఎస్ అభ్యర్ది గంగుల కమలాకర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దాంతో క్షణాల్లో గంగుల కమలాకర్ అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. మరో వైపు తామే గెలిచినట్టుగా సంబరాలు చేసుకోబోయారు. పోలీసులు అడ్డుకొని పక్కకు వెళ్లాలి అని సూచించినా కూడా పట్టించుకోకుండా అక్కడే ఉండి పోయారు. పొన్నం వర్గీయులు కూడా ఆందోళన చేస్తూ వారు వెళితేనే తాము వెళుతామని ఆందోళన చేశారు.
కరీంనగర్ ఏసీపీ అశోక్ సూచనతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు ఇరు వర్గాల పై స్వల్ప లాఠీఛార్జీ చేసి వారిని బెదరగొట్టారు. ఇంతలో కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి అక్కడకు చేరుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈలోగా పోలింగ్ సమయం అయిపోవడంతో కార్యకర్తలు అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. లాఠీ ఛార్జీ లో టిఆర్ఎస్ మైనారిటి నాయకుని తలకు గాయాలయ్యాయి. ఆర్పీఎఫ్ జవాన్లు కార్యకర్తలను ఉరికించి ఉరికించి తరిమారు. ఇందులో గంగుల కమలాకర్ కూడా జవాన్ల దెబ్బకు పరుగులు తీశాడు. ఆ వీడియో కింద ఉంది చూడండి.