బ్రేకింగ్ : కాంగ్రెస్ గండ్ర పై బెదిరింపుల కేసులు

 

బ్రేకింగ్ : కాంగ్రెస్ గండ్ర పై బెదిరింపుల కేసులు

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సంగారెడ్డి నేత జగ్గారెడ్డిని అరెస్టు చేసి 24 గంటలు గడవకముందే మరో కాంగ్రెస్ నేతపై ఐదు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులకు పాల్పడినట్లు గండ్ర మీద పోలీసు కేసులు ఫైల్ అయ్యాయి. 

గండ్ర వెంకట రమణారెడ్డి తనను బెదిరింపులకు గురిచేశాడంటూ ఎర్రబెల్లి రవీందర్ రావు శాయంపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు శాయంపేట పోలీసులు 5 సెక్షన్ లకింద కేసులు నమోదు చేశారు.

తుపాకీతో తనను చంపుతానంటూ గండ్ర వెంకట రమణారెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు ఎర్రబెల్లి రవీందర్ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రాణాలకు హాని ఉందని, తక్షణమే తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.  క్రషర్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. క్రషర్ విషయంలోనే గండ్ర సోదరులిద్దరూ తుపాకీతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

జగ్గారెడ్డి అరెస్టు నేపథ్యంలో ఈ కేసు వ్యవహారం చర్చనీయాంశమైంది. 14 ఏండ్ల కిందటి కేసును తిరగదోడి జగ్గారెడ్డిని రాత్రికి రాత్రే అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు మరో సంలచనం నమోదు చేశారు. తాజాగా గండ్రతోపాటు గండ్ర సోదరుడైన గండ్ర భూపాల్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది.

ఈ కేసుల తీవ్రతను చూస్తే గండ్ర వెంకట రమణారెడ్డితోపాటు ఆయన సోదరుడు భూపాల్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారా అన్న అనుమానాలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో నెలకొన్నాయి. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ కీలక  నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

నిన్న జగ్గారెడ్డి, నేడు గండ్ర, మరి రేపెవరు అన్న భయం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నేతల మీద అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి.  ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారోనన్న భయంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. 

అయితే ఈ కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, టిఆర్ఎస్ కుయుక్తులను సమర్థంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మాత్రం ఆందోళనతో ఉన్నాయి.

గండ్ర వెంకట రమణారెడ్డి మీద గతంలోనే ఒక మహిళ వివాదం రేపారు. గండ్ర తనను వాడుకుని వదిలేశారని ఆ మహిళ రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేపట్టారు. అయితే ఆ కేసులో గండ్రను అరెస్టు చేయలేదు. పైగా ఆ కేసులో అరెస్టు చేస్తే గండ్ర కు మైలేజీ వస్తుందన్న ఉద్దేశంతోనే ఆ కేసును పక్కకు పెట్టారని అప్పట్లోనే ప్రచారం సాగింది. 

ఇప్పుడు బెదిరింపుల కుేసు వెలుగుచూడడంతో గండ్ర అరెస్టు కూడా జరిగే అవకాశముందా అన్న ప్రచారం ఊపందుకున్నది.