ఇదేం అప్లై ప్రాసెస్ రా బాబూ.. అంటున్న తెలంగాణ నిరుద్యోగులు

 

పంచాయతీ కార్యదర్శుల నియామాకాలకు నోటిఫికేషన్ విడుదలయ్యి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దరఖాస్తుల్లో అభ్యర్దులకు తిప్పలు ఎదురవుతున్నాయి. అప్లికేషన్లను tspri.cgg.gov.in ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. జనరల్ అభ్యర్ధులకు 800 రూ. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ. 400గా ఫీజు నిర్ణయించారు. ఈ నెల 3 నుంచి 12 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఇంత వరకు బానే ఉన్నా అసలు కథ ఇక్కడే ప్రారంభమవుతుంది.

అప్లికేషన్ చేసేటప్పుడు ముందుగా ఫీజును చెల్లించాలని వెబ్ సైట్ లో సూచనలు ఉన్నాయి. సూచనల ప్రకారం ఫీజు ఆన్ లైన్ లో పే చేస్తే ఫీజు సక్సెస్ ఫుల్ గా పేమెంట్ అయినట్టు చూపిస్తుంది, అభ్యర్ధి అకౌంట్ లో పైసలు కూడా కట్ అవుతున్నాయి. కానీ తదుపరి ప్రాసెస్ కు వెళ్లే ముందు ఫీజు పే కానట్టుగా చూపించి మళ్లీ ఫీజు పే చేయాలని చూపిస్తుంది. దీంతో అభ్యర్ధుల అప్లికేషన్ కోసం మళ్లీ ఫీజు చెల్లించి ప్రాసెస్ ను కొనసాగించాల్సి వస్తుంది. కట్ అయిన డబ్బులు తిరిగి వస్తాయా రావా అనే విషయంలో క్లారిటి లేదు. దీంతో అభ్యర్దులు అయోమయానికి గురవుతున్నారు. టిఎస్ పీఎస్సీ అప్లికేషన్ ప్రాసెస్ లో డబ్బులు కట్ అయితే అవి తిరిగి రీఫండ్ చేసేవారు. కానీ పంచాయతీ కార్యదర్శుల అప్లికేషన్లలో మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. 

పంచాయతీ సెక్రటరీ కోసం ఓ అభ్యర్ధి తాను రెండు సార్లు ఫీజు చెల్లించానని అయినా కూడా అప్లికేషన్ విజయవంతం కాలేదని వాపోయారు. అకౌంట్ నుంచి 800 రూపాయలు కట్ అయ్యాయని తెలిపారు. కట్ అయిన డబ్బులు అసలు తిరిగి వస్తాయా రావా అనే అంశంలో క్లారిటి లేదన్నారు. పంచాయతీ రాజ్ వారు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినా అవి పనిచేయడం లేదని గంటల కొద్దీ ప్రయత్నించినా ఫోన్లు కలవడం లేదన్నారు. పంచాయతీ వెబ్ సైట్ లో ఉన్న నంబర్లు..9346180688, 9989240688, 9949310688, 9949418118 అనే నంబర్లను కాంటాక్ట్ నంబర్లుగా ఇచ్చినా అవి ఎప్పుడూ బిజినే వస్తున్నాయని, దీంతో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఈ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలన్నారు.

అసలే నిరుద్యోగులు.. పైసలు లేక కష్ట కాలంలో ఉంటే ఇలా నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ టెక్నికల్ సమస్యకు వెంటనే పరిష్కారం చూపించి ఇప్పటి వరకు అప్లై చేసిన అభ్యర్దులకు కట్ అయిన డబ్బులను తిరిగి రిఫండ్ చేయాలని అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు.