పాదయాత్ర వ్యవహారంతో వచ్చిన మైలేజీ కంటే, ఒక్క అరెస్టుతో వచ్చిన పొలిటికల్ చాలా చాలా ఎక్కువ.. ఈ విషయంలో షర్మిల ‘లక్కు తోక’ తొక్కారనే అనుకోవాలి. నేషనల్ మీడియా సైతం వైఎస్ షర్మిల అరెస్టు వ్యవహారాన్ని హైలైట్ చేసింది.
అంతకు ముందు వరకు వైఎస్ షర్మిలను పట్టించుకోని మీడియా, తెలంగాణ సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద హైడ్రామాకి ప్లాన్ చేశాక, ఆమె అరెస్టయ్యాక.. మొత్తంగా ఆమెకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టినమాట వాస్తవం.
మరి, ఇంతలా పొలిటికల్ మైలేజ్ వచ్చాక.. వైఎస్ షర్మిల ఎందుకు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు.? ఇదే ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణుల్నీ అయోమయానికి గురిచేస్తోంది. పాదయాత్ర కోసం వైఎస్ షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆమెకు ఊరట లభించింది. కానీ, పోలీసులు పాదయాత్రకు అనుమతించలేదు. ఈ క్రమంలో హైడ్రామా నడిచింది. అరెస్టుల పర్వం షురూ అయ్యింది. మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి ఇంకోసారి ఊరట పొందారు షర్మిల.
మామూలుగా అయితే, ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల ఇంకాస్త ప్రతిష్టాత్మకంగా పాదయాత్ర చేసి తీరాలి. కానీ, వైఎస్ షర్మిల తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. సంక్రాంతి తర్వాత తిరిగి తన పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్ షర్మిల తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈమాత్రందానికి పాదయాత్ర కోసం అనుమతి కోరుతూ హైకోర్టు మెట్లెక్కడమెందుకు.? రాజకీయాల పట్ల వైఎస్ షర్మిలకు అస్సలేమాత్రం సీరియస్‌నెస్ లేదనే విషయం ఈ ఘటనతో నిరూపితమయిపోయింది. ఎవరో వదిలిన బాణంలా వ్యవహరించడం తప్ప, తనకంటూ సొంత విధానం ఆమెకు రాజకీయంగా లేకుండా పోయిందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.