కోమటిరెడ్డికి షాక్… కాంగ్రెస్ కు ఇద్దరు కీలక నేతల రాజీనామా

ఎన్నికల సమయంలో పార్టీలకు షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. పార్టీలకు కీలక నేతల రాజీనామాలతో నేతలల్లో కలవరం మొదలవుతోంది. ఇప్పటి వరకు టిఆర్ ఎస్ నుంచి పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. నల్లగొండలో ఊహించని విధంగా కాంగ్రెస్ కు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరులు రాజీనామా చేసి కారు ఎక్కారు.

నల్లగొండ  కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి చిలుక గోవర్ధన్, న్యాయవాది ధరణి కోట రాము ప్రధాన అనుచరులు. మంత్రి కేటిఆర్ సమక్షంలో గురువారం టిఆర్ఎస్ పార్టీలో వారు చేరారు. నల్లగొండలో కోమటిరెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్నవారు పార్టీని వీడటంతో కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. కోమటిరెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎన్నికలకు వారం ముందు ప్రధాన నేతలు కాంగ్రెస్ ను వీడటంతో ఇది కోమటిరెడ్డికి దెబ్బగా చెప్పవచ్చని వారన్నారు.

కేటిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరుతున్న చిలక గోవర్ధన్

చిలక గోవర్ధన్ మూడు సార్లు నల్లగొండ మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. ప్రస్తుతం కోమటిరెడ్డికి కాంగ్రెస్ ప్రచారంలో కూడా గోవర్దన్ పాల్గొన్నారు.

మరోక నేత ధరణి కోట రాము న్యాయవాది మరియు సీనియర్ నేత. కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి సంఘం ఎన్ ఎస్ యూఐ ప్రతినిధిగా, యూత్ కాంగ్రెస్ సభ్యుడిగా రాము పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. దివంగత చకిలం శ్రీనివాసరావు అనుచరుడిగా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించడంతోపాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. 

మంత్రి కేటిఆర్ ఆధ్వర్యంలో గోవర్ధన్, రాము పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా గోవర్ధన్ మాట్లాడుతూ…

“నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతర కృషి చేశాం. నల్లగొండ అభివృద్ది లేక చాలా వెనుకబడిపోయింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్థానికంగా ఉండకుండా హైదరాబాద్ లో ఉండడంతో ప్రజలల్లో వ్యతిరేకత వచ్చింది. ఏమైనా పనులు కావాలంటే హైదరాబాద్ కు వెళ్లడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. స్థానికంగా వెంకట్ రెడ్డి ఉండకపోవడంతో నల్లగొండలో సమస్యలు పెరిగిపోయాయి. సమస్యల పరిష్కారంలో కోమటిరెడ్డి విఫలమయ్యారు. నల్లగొండలో లోకల్ లీడర్లకు కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాధాన్యతనివ్వలేదు. చాలా అవమానాలకు గురయ్యాం. పిసిసి లో కూడా సరైన పదవులు లేవు. ఏళ్ల తరబడి పార్టీలో ఉంటే గుర్తింపు లేనప్పుడు పార్టీలో కొనసాగకపోవడమే మంచిదని నిర్ణయించుకోని కాంగ్రెస్ కు రాజీనామా చేశాను” అని అన్నారు.

నల్లగొండలో కీలక నేతలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది. గోవర్ధన్, రాము ల రాజీనామా ప్రభావం ఓట్ల పై పడే అవకాశం ఉంటుందని వారన్నారు. ఇప్పటి వరకు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కి వలసలు సాగగా నల్లగొండలో మాత్రం కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వలసలు మొదలయ్యాయి. వీరిని పార్టీలో చేర్చుకునేందుకు మంత్రి జగదీష్ రెడ్డి మంతనాలు జరిపారు.