తెలంగాణకు ఇద్దరు వ్యక్తులు ప్రమాదకారిగా తయారయ్యారని పోలీసులు వారిపై హైదరాబాద్ నగర్ బహిష్కరణ వేటు వేశారు. అందులో విశ్లేషకులు కత్తి మహేష్ కాగా మరొకరు స్వామీ పరిపూర్ణానంద. వీరిద్దరూ తెలంగాణలో అశాంతిని రేపేలా వ్యవహరించినట్లు ఆరోపణలు చేస్తూ పోలీసులు నగర బహిష్కరణ విధించడమే కాదు హుటాహుటిన వారిని తెలంగాణ పొలిమేరలు దాటించేశారు. వీళ్లు చేసిన పనికి ఇవేమి శిక్షలు అని కూడా కొందరు పెదవి విరిచారు. అయితే ఈ బహిష్కరణల వేటు వెనుక పెద్ద మతలబులే ఉన్నట్లు గుసగుసలు మొదలయ్యాయి. సందుట్లో సడేమియా అన్నట్లు ఈ బహిష్కరణల మాటున టిఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఒక సెటిల్మెంట్ చేసేసుకుందని వార్తలొస్తున్నాయి. ఆ వివరాలేంటో చదువుదాం రండి.
హిందువులు పవిత్రంగా భావించే రాముడు, సీతమ్మ గురించి సినీ విశ్లేషకులు కత్తి మహేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. దీంతో హిందూ సంస్థలు రంగంలోకి దిగాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఏకంగా స్వామీ పరిపూర్ణానంద కూడా రంగంలోకి దిగారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ర్యాలీకి సిద్ధమయ్యారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ర్యాలీ చేపట్టాలని ఆయన సంకల్పించి కార్యాచరణ షురూ చేశారు. ఇంతలో కత్తి మహేష్ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు కాబట్టి ఆరు నెలలపాటు నగర బహిష్కరణ విధించారు పోలీసులు.
కత్తిమహేష్ ను బహిష్కరించగానే ఇష్యూ సెటిల్ అయిపోతుందని తెలంగాణ సర్కారు భావించింది. కానీ సమస్య సమసిపోలేదు. కొత్త సమస్య ముందుకొచ్చింది. కత్తి మహేష్ దళితుడు కాబట్టే ఆయన మీద వేటు వేసి దొరతనం చూపారంటూ విమర్శలు షురూ అయ్యాయి. దళిత మేధావులు ఏకంగా డిజిపికి ఉత్తరం రాశారు. సోషల్ మీడియాలో దళితుడు కాబట్టే వెలి వేటు వేశారంటూ పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈ కేసులో ఎంబిటి కూడా సీన్ లోకి వచ్చింది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంత రెచ్చగొట్టేలా మాట్లాడినా ఎందుకు నగర బహిష్కరణ చేయలేదని ప్రశ్నించారు. తన చిరకాల ప్రత్యర్థి అయిన ఎంబిటి పార్టీ ఈ కేసులో యాక్షన్ లోకి రావడంతో ఎంఐఎం పార్టీ అలర్ట్ అయింది. వెంటనే ఎంఐఎం కూడా రంగంలోకి దిగింది.
కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేసిన గంటల తేడాతో స్వామీ పరిపూర్ణానంద కూడా వేటుకు గురయ్యారు. ఈయన మీద కూడా ఆరు నెలలు బహిష్కరణ వేటు పడింది. ఈయనను బలవంతంగా తెలంగాణ పొలిమేరలు దాటించేశారు. అయితే హిందూ ధర్మ పరిరక్షణ పాదయాత్ర చేస్తానంటూ బయలుదేరడంతో స్వామిని అరెస్టు చేశారు. అయితే స్వామిని అరెస్టు చేయడం వెనుక కీలక సూత్రధారి ఎంఐఎం పార్టీ అంటున్నారు. స్వామీ పరిపూర్ణానందను అరెస్టు చేయాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ప్రభుత్వం పై వత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. నిజామాబాద్ ఎంపి కవిత ద్వారా ఈమేరకు అసద్ సర్కారుపై వత్తిడి పెంచారని చర్చ జరుగుతున్నది. అసద్ వత్తిడి మేరకే పరిపూర్ణానంద మీద కూడా తెలంగాణ పోలీసులు వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఇక్కడ ఒక రాజకీయ సెటిల్ మెంట్ కూడా జరిగిందని చెబుతున్నారు. అదేమంటే..? స్వామీ పరిపూర్ణానందను నగర బహిష్కరణ వేటు వేయిస్తే.. బోధన్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య పై అవిశ్వాస నోటీసును వెనక్కు తీసుకుంటామని ఎంఐఎం ప్రతిపాదించింది. అసలే టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అంతటా అవిశ్వాసాల టెన్షన్ పట్టుకున్న ఈ సమయంలో ఇదేదో బాగానే ఉందని సర్కారు వేటు దిశగా సాగిందని చెబుతున్నారు. నిజామాబాద్ ఎంపి కవిత, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఇద్దరూ కలిసి చర్చించుకున్నారు. తర్వాత ఇటు టిఆర్ఎస్ కౌన్సిలర్లు, అటు మజ్లిస్ కౌన్సిలర్లు శాంతించారు. వీరి భేటీ తర్వాత అవిశ్వాసం వ్యవహారం సద్దుమణిగింది. టిఆర్ఎస్ బోధన్ లో ఊపిరి పీల్చుకుంది.
సో.. మొత్తానికి పరిపూర్ణానంద బహిష్కరణకు అసలు కారణం ఇదేనా అని రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైనా రాజకీయం రాజకీయమే అంటున్నారు జనాలు.