హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలను చుట్టుముట్టిన వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. మిస్ ఇంగ్లండ్ 2025 మిల్లా మాగీ చేసిన సంచలన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపగా, ఆమెపై వేధింపులు జరిగాయని ఇంగ్లండ్ మీడియాలో వచ్చిన కథనాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. “పోటీల కోసం వచ్చామో, లేక అలరించేందుకు తేల్చలేకపోతున్నాం” అనే ఆమె వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమె స్వదేశానికి తిరిగిపోగా, తెలంగాణ పరువు నష్టం అన్నట్టుగా రాష్ట్రవ్యాప్తంగా స్పందన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టిసారించగా, సీనియర్ అధికారుల నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. శిఖా గోయల్, రమా రాజేశ్వరి, సాయిశ్రీలతో కూడిన త్రిసభ్య కమిటీ ఇప్పటికే బాధితురాలిగా పేర్కొన్న మిల్లా పాల్గొన్న కార్యక్రమాలపై వీడియోలు, వాంగ్మూలాలు సేకరిస్తోంది. మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లే, పర్యాటక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌ల నుంచి కూడా వివరణలు తీసుకుంటోంది. ఆమె హాజరైన విందులో పాల్గొన్నవారు, నిర్వహణ బృందంతో కలిసి వ్యవహరించినవారిపై స్పష్టత కోసం అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను ప్రతిష్టాత్మకంగా నిలబెట్టే ఈ ఈవెంట్‌లో ఈ ఆరోపణలు ఊహించని దిశగా వెళ్తున్నాయి. జూలియా మోర్లే, జయేష్ రంజన్ చేసిన ఖండనలతోపాటు, కమిటీ నివేదిక అనంతరం నిజానిజాలపై స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర పరువు, మరోవైపు మహిళా భద్రత వంటి కీలక అంశాలు ఈ ఘటనకు సంభంధించడంతో దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, పారదర్శక నివేదికను సమర్పించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.