భారత్‌లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లండ్ 2025 మిల్లా మాగీ వైదొలిగిన విషయంపై వివాదాస్పద ప్రచారం జరగడం పట్ల మిస్ వరల్డ్ సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్రిటిష్ మీడియాలో వస్తున్న కథనాలు తప్పుడు సమాచారంతో నిండి ఉన్నాయని స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్, సీఈఓ జూలియా మోర్లే అధికారిక ప్రకటన విడుదల చేశారు.
మిల్లా మాగీ పోటీల నుంచి వైదొలిగినది తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి కారణంగానే జరిగిందని మోర్లే తెలిపారు. “ఆమె తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మిల్లా స్వయంగా ఈ విషయాన్ని మాతో షేర్ చేయడంతో, ఆమెకు పూర్తి సహకారం అందించాం. తక్షణమే లండన్‌కి తిరిగి వెళ్లే ఏర్పాట్లు కూడా మేమే చేశాం,” అని చెప్పారు.
మిల్లా మాగీ స్థానంలో మిస్ ఇంగ్లండ్ రన్నరప్ షార్లెట్ గ్రాంట్ భారత్‌కు వచ్చి పోటీల్లో పాల్గొంటున్నారని మోర్లే వెల్లడించారు. షార్లెట్‌ను మిస్ వరల్డ్ కుటుంబం సాదరంగా ఆహ్వానించిందని, ప్రస్తుతం ఆమె అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారని తెలిపారు.
ఇక కొన్ని బ్రిటిష్ మీడియా సంస్థలు మిల్లా అనుభవాలపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని మోర్లే ఆరోపించారు. “మిల్లా మాకు పోటీల ప్రారంభంలో చేసిన ప్రశంసలు, సంతోషంతో పంచుకున్న భావాలను వీడియో రూపంలో పబ్లిక్‌కు అందించాం. ఆమె ఆనందంగా పాల్గొన్న దృశ్యాలు వాటిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి,” అని జూలియా స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై వస్తున్న అసత్య ప్రచారాలకు సమాధానం ఇచ్చినట్లైంది.