సైలెన్స్ ప్లీజ్: రేవంత్ విషయంలో కేటీఆర్ జంకుతున్నారా?

సాధారణంగా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ – కేటీఆర్ ల వాక్ చాతుర్యానికి బలమైన పోటీలేదని అనుకునేవారు! వారు చేసే విమర్శలు.. అందుకు వారు ఎంచుకునే ప్రాసలు – మోటు సామెతలు, దానికితోడు అద్భుతమైన ప్రజెంటేషన్ స్కిల్స్… ఇలా అన్నీ కలిపి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేస్తాయి. ఇక ఈమధ్యకాలంలో అయితే కేసీఆర్ ని సైతం తలదన్నే స్థాయిలో కేటీఆర్ విమర్శలు – ప్రతివిమర్శలూ ఉంటున్న పరిస్థితి. అలాంటి కేటీఆర్ సైతం రేవంత్ విమర్శలకు మాత్రం మౌనాన్నే తన భాషగా చేసుకుంటున్నారు.. స్పందించకుండా సైలెంట్ అయిపోతున్నారు. దీంతో.. సైడైపోతున్నారనే కామెంట్లకు బలవుతున్నారు!

వివరాళ్లోకి వెళ్తే… టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం.. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు తన పేషీ మీదకు రావటం, విపక్షాలన్నీ తన పీఏ తిరుపతి వైపు వేలెత్తి చూపిటం పై కేటీఆర్ ఇంకా స్పందించలేదు! సాధారణంగా ఈస్థాయి విమర్శలు వచ్చినప్పుడు కేటీఆర్ స్పందన బలంగా ఉంటుందని, ఆ విమర్శలకు తీవ్రంగా తిప్పి కొట్టడమే కాదు, తమ పేషీకి ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారని ఆశించారు! అయితే.. అందుకు పూర్తిభిన్నంగా కేటీఆర్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవటం హాట్ టాపిక్ గా మారింది. దీంతో మంత్రి కేటీఆర్ మౌనాన్ని ఏ రీతిలో అర్థంచేసుకోవాలి అనే ప్రశ్న గులాబీ వర్గాల్లో మొదలైంది.

అయితే ఈ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కేటీఅర్ చేసిన కామెంట్లకంటే ముందు.. దాదాపు ఇవే విమర్శలు బండి సంజయ్ కూడా చేశారు. కాకపోతే వాటిలో సబ్జెక్ట్ కంటే ఎక్కువగా రాజకీయ విమర్శలు ఉండటంతో… వెంటనే స్పందించిన కేటీఆర్… “సంజయ్ కు తలకాయ ఉందా?” అంటూ ఫైరయ్యారు. అయితే ఒకరోజు తర్వాత మరింత కీలకమైన సమాచారంతో.. మరింత అర్ధవంతంగా.. రాజకీయ విమర్శలకు తావులేకుండా… సబ్జెక్ట్ మాత్రం మాట్లాడుతూ కేటీఆర్ ని సూటిగా టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. దీంతో కేటీఆర్ నుంచి స్పందన కరువైంది!

ఇవే విమర్శలు బండి చేస్తే.. అన్నేసి మాటలన్న కేటీఆర్.. రేవంత్ చేసిన ఘాటు ఆరోపణలపై మాత్రం ఎందుకు పెదవి విప్పటం లేదు? కేటీఆర్ పీఏ తిరుపతిపై రేవంత్ చేసిన ఆరోపణలు వాస్తవాలేనా? నిజంగా… పేపర్ల లీకేజీ ఉదంతంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి కి టీఎస్పీఎస్సీలో ఉద్యోగం ఇప్పించిందే తిరుపతేనా? అందుకే కేటీఆర్ మౌనాన్నే వహించారా? మాట కూడా స్పందించకున్నారా? అనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా మొదలైపోయాయి!

ఇదేక్రమంలో.. విద్యాశాఖామంత్రి సభితను పక్కనపెట్టి ఈ వ్యవహారంపై మాట్లాడిన సందర్భంగా… “ఈ లీకేజీ వ్యవహారంలో ఇద్దరికి మాత్రమే బాధ్యత ఉంది” అని మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ స్పందించారు. దీంతో మైకందుకున్న రేవంత్… టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో నిందితుల్లో ప్రాథమికంగా తొమ్మిది మందిని గుర్తించి అరెస్టు చేస్తుంటే… ఈ వ్యవహారంలో ఇద్దరికి మాత్రమే బాధ్యత ఉందని ఎలా సర్టిఫికేట్ ఇస్తారంటూ రేవంత్ సూటి ప్రశ్న ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.

ఏది ఏమైనా… రాజకీయాల్లో మంచో చెడో… విమర్శలకు, ఆరోపణలకూ స్పందించాలి. అలా కాకుండా మౌనంగా ఉంటే… పైగా కీలకమైన నేతలు – అంతే కీలకమైన విపక్ష నేతలు చేసిన – మరింత కీలకమైన ఆరోపణలపై స్పందించకుంటే… ఆ విమర్శలను నిజమనుకునే ప్రమాధం లేకపోలేదు అని అంటున్నారు విశ్లేషకులు!