Jupally Krishna Rao: సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం పోయిందా..? మంత్రి జూపల్లి వ్యాఖ్యల వెనక మర్మం ఏంటి..?

Jupally Krishna Rao

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయా..? సీఎం రేవంత్ రెడ్డి పాలనపై నేతలకు నమ్మకం పోయిందా..? ఇటీవల ఆ పార్టీ ముఖ్య నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వెనక మర్మం ఏంటి..? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని ఫిక్స్ అయ్యారా..? ఇప్పటి నుంచే ఓటమి భయంతో సైడ్ అయిపోతున్నారా..? లేక ముఖ్యమంత్రిపై అసంతృతప్తితో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా..? అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది..?

కాంగ్రెస్ పార్టీ అంటేనే లుకలుకలు..

సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే లుకలుకలు సహజం. ఒకరిపై ఒకరు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూంటారు. అదేమైనా అంటే తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని చెబుతారు. పార్టీ పెద్దల నుంచి రాష్ట్రాల నేతల వరకు ఇదే ఒరవడి కొనసాగిస్తున్నారు. ఏ పార్టీలో అయినా అధిష్టానం ఆదేశాలను జవదాటరు. హద్దు మీరరు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోరు. అలా చేసిన వారిని వెంటనే ఆయా పార్టీల నుంచి వెంటనే సస్పెండ్ చేశారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం ఇందుకు భిన్నం. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటారు. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై కూడా అలవోకగా తమ అసంతృప్తి వ్యక్తంచేశారు. అయినా కానీ పార్టీ అధిష్టానం అంతగా పట్టించుకోదు. దీంతో నేతల మాటలు హద్దు మీరుతున్నాయి. అంతిమంగా ఇవి పార్టీకే చెడ్డ పేరు తీసుకువస్తున్నాయి.

రేవంత్ రెడ్డి సీఎం కావడంపై అసంతృప్తి..

తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా కొన్ని రోజులుగా ఇదే తంతు నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని అధిష్టానం ముఖ్యమంత్రిని చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చాలా మంది సీనియర్ నేతలకు నచ్చలేదు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తమను కాదని.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన రేవంత్ రెడ్డికి ఏకంగా సీఎం పదవి ఎలా ఇస్తారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అధిష్టానం సర్దిచెప్పడంతో అంతా సర్దుకున్నారు. సీనియర్ నేతలకు ఇచ్చిన మంత్రుల శాఖల్లో సీఎం జోక్యం చేసుకోకుండా షరతులు విధించింది. దీంతో కాస్త కుదురుకున్నారు. కానీ లోలోపల మాత్రం రగిలిపోతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో..?

ఈ కోవలోకి ముఖ్యంగా సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందువరుసలో ఉంటారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో కోపంతో ఊగిపోతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదంటూ హాట్ కామెంట్స్ చేశారు. అందుకే ప్రజలను తాను ఎలాంటి హామీలు ఇవ్వనని స్పష్టం చేశారు.

జూపల్లి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో అలజడి..

ఈ క్రమంలో జూపల్లి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదని కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా మంత్రులే కామెంట్స్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. ఏది ఏమైనా కానీ బహిరంగసభలో ఏకంగా మంత్రే మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదని చెప్పడం కాంగ్రెస్‌లో అలజడి రేపింది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అసంతృప్తి జ్వాల మరింత రాజుకోకుండా అధిష్టానం అడ్డుకట్ట వేస్తే మంచిదని సూచిస్తున్నారు.