సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు కవాతు ఖమ్మం పట్టణంలో కదం తొక్కింది. పట్టణంలో ఎటు చూసినా తిరంగా జెండా రెపరెపలాడింది. వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు, మిత్రపక్షాల నేతలు.. రైతులు స్వచ్ఛందంగా ఈ కవాతులో పాల్లొన్నారు. బలౌదామా… బతుకుదామా? నడ్డి విరగ్గొంటించుకుందామా… లేక తిరగడదామా?? అంటూ ఖమ్మం రైతు కవాతులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వేసిన ప్రశ్నలు తూటాలా పేలాయి. కేసీఆర్ పై చేసిన ఏక వచన ప్రయోగం కూడా కవాతులో పాల్గొన్న రైతులను ఉత్తేజ పరిచింది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి నిప్పులు చెరిగారు. భట్టి విక్రమార్క ప్రసంగిస్తున్నంత సేపు కార్యకర్తలు, రైతులు చప్పట్లు, విజిల్స్ తో మోత మోగించారు. ముఖ్యంగా కేసీఆర్ పై ….నువ్వెవడ్రా…. అని మాట్లాడిన సమయంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.ఈ ధర్నాలో భట్టి విక్రమార్క మల్లుతో పాటు, రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు కత్తి వెంకట స్వామి,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావీద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు, వామపక్ష నాయకులు పోటు ప్రసాద్, సింగు నరసింహరావు, తాటి వెంకటేశ్వర్లు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ…ఇప్పుడు మన ముందున్న సమస్య చాలా గంభీరమైందని అన్నారు. ఈ దేశ ఆర్థిక పరిస్థితికి వెన్నుముకైన వ్యవసాయ రంగం అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగురోజులు కాకముందే తోకముడిచి ఢిల్లీ వెళ్లి అయ్యా… నీకు దండం పెడతా నీకు వ్యతిరేకంగా నేనేం చేయను అని మోదీ ముందు మోకరిల్లారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదిలావుండగా పంటను కొనటానికి అసలు నువ్వెవడ్రా అని కేసీఆర్ పై బట్టి మాటలు తూటాలు పేల్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదే రైతులను రక్షించడానికి అని చెప్పారు.