తెలంగాణ: కొంపల్లిలో ఉన్న మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజిని నాక్ (NAAC) బ్లాక్ లిస్టులో పెట్టింది. ఐదు సంవత్సరాల పాటు బ్లాక్ లిస్టులో పెడుతున్నట్టు యాజమాన్యానికి లేఖను పంపింది. డిసెంబర్ 24వ తేదీన నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ పరిపాలన అధికారి ఎం. అరుణ్ ఈ లేఖను పంపారు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. రీ అసెస్‌మెంట్ కోసం మల్లారెడ్డి కాలేజీ పంపిన పత్రాలను పరిశీలించినప్పుడు తాము అందులో కొన్ని ఫేక్ డాక్యుమెంట్లను గమనించినట్టు తెలిపారు. ‘మల్లారెడ్డి కాలేజీ సమర్పించిన పత్రాల్లో బీహెచ్ఈఎల్, యష్ టెక్నాలజీస్, ఎయిర్‌టెల్ నుంచి సమర్పించిన సర్టిఫికెట్ల సీల్, సంతకాలు, లెటర్ హెడ్స్ అన్నీ ఫేక్ అని అనుమానం వచ్చింది. మా టీమ్‌లోని డిజిటల్ నిపుణులు కూడా అవి ఫేక్ డాక్యుమెంట్లు అని నిర్ధారించారు.
2020 నవంబర్ 20న నాక్ సమావేశంలో తీర్మానించిన ప్రకారం ఇలాంటి పనులకు పాల్పడే వారి కాలేజీని అక్రిడేషన్ నుంచి బ్లాక్ లిస్టులో పెట్టాలి. ఆ తీర్మానం ప్రకారం మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌ను కూడా అక్రిడేషన్ ప్రాసెస్ విషయంలో ఐదేళ్లు బ్లాక్ లిస్టులో పెడుతున్నాం.’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పలు విద్యాసంస్థలను నడుపుతున్నారు. అందులో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. విద్యాసంస్థలు పాటించే ప్రమాణాలను బట్టి నాక్ వాటికి అక్రిడేషన్ ఇస్తూ ఉంటుంది. అయితే, అక్రిడేషన్ కోసం సమర్పించిన పత్రాలు నకిలీవి సృష్టించారని ఇప్పుడు నాక్ ఆరోపించింది. ఈ వ్యవహారం మీద మంత్రి మల్లారెడ్డి స్పందించాల్సి ఉంది.