మహా కూటమిలో టిజెఎస్ సీట్లు ఇవే, ఆ రెండు సీట్లలో ఫ్రెండ్లీ కాంటెస్ట్

మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. దీంతో కూటమి స్పూర్తికి విఘాతం కలగకుండా ఉండేందుకు కొత్త ఫార్ములా కనిపెట్టారు మహా కూటమి నేతలు. ఏ సీటు ఎవరికి అనేది అధికారికంగా ప్రకటించినా కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీలు తప్పవని నిర్ణయానికి వచ్చారు.

అంటే తెలంగాణ సన సమితికి ప్రకటించిన సీట్లలో రెండు సీట్లలో మాత్రం కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి కూడా ఉంటాడని కాంగ్రెస్ వర్గాల నుంచి అందిన సమాచారం. దానికి టిజెఎస్ కూడా అంగీకరించినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. టిజెఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహా కూటమిలో ఆ పార్టీ పోటీ చేయబోయే స్థానాలు ఇవే

1 మెదక్

2 దుబ్బాక

3 మల్కాజ్ గిరి

4 జనగామ

5 వర్దన్నపేట

6 వరంగల్ ఈస్ట్

7 సిద్ధిపేట

8 మిర్యాలగూడ

9 రామగుండం

పై సీట్లన్నీ తెలంగాణ జన సమితికి కూటమిలో భాగంగా కేటాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు మరో రెండు సీట్లలో స్నేహపూర్వక పోటీలు జరగబోతున్నాయని తెలుస్తోంది. ఆ రెండు సీట్లు ఇవే.

1 ఆసిఫాబాద్

2 స్టేషన్ ఘన్పూర్ 

ఈ రెండు స్థానాల్లో టిజెఎస్ అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు తమ పార్టీల గుర్తులతో పోటీ చేయబోతున్నారు. ఈలెక్కలు చూస్తే తెలంగాణ జన సమితికి కూటమిలో 9 పార్టీలను కేటాయించినట్లు తెలుస్తోంది.

అయినా తప్పని మహా టెన్షన్

మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి లేదు. కూటమి నేతలు చర్చోప చర్చలు చేస్తున్నారు కానీ ఏ సీటు ఎవరికి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నదానిపై ఇంకా తేల్చకుండా సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. 

ఒకవైపు సిపిఐ కూటమిలోని పెద్దన్న గా ఉన్న కాంగ్రెస్ మీద నిప్పులు చెరుగుతున్నది. అంతేకాకుండా ఐదుగురు అభ్యర్థులను కూడా బరిలోకి దింపింది సిపిఐ. కూటమిలో సక్రమంగా నడవాలంటే తాము పోటీ చేయబోతున్న స్థానాల్లో కూటమి పార్టీలు పోటీ చేయకూడదని చెయకూడదని చెబుతున్నది.

ఈ పరిస్థితుల్లో ఆదివారం కూటమి పార్టీల మధ్య కీలక పరిణామాలు జరిగాయి. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిడిపి తెలంగాణ అధినేత ఎల్.రమణ ఇద్దరూ తెలంగాణ జన సమితి కార్యాలయానికి వచ్చారు. మూడు పార్టీల నేతల మధ్య గంట పాటు చర్చలు జరిగాయి. అనంతరం కోదండరాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రమణ ముగ్గురూ మీడియాతో మాట్లాడారు. అనేక అంశాలను వెల్లడించారు.

కానీ తెలంగాణ ప్రజలంతా, ఎపి ప్రజలంతా ఎదురుచూస్తున్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు నరాలు తెగే ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న అంశంలో స్పష్టత ఇవ్వకుండానే దాటవేశారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న ముచ్చట తేల్చలేదు. ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నది కూడా తేల్చలేదు.  ఆ ముచ్చట్లన్నీ నామినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత వెల్లడిస్తారని చల్లగా చెప్పారు. దీంతో కూటమి పార్టీల్లోని కేడర్ లో టెన్షన్ మరింత పెరుగుతున్నది.

టిఆర్ఎస్ కు వనుకు పుట్టింది

తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం కు కూటమిలో ఉన్నత స్థానం దక్కబోతున్నట్లు టిడిపి అధ్యక్షులు ఎల్. రమణ మీడియాతో చెప్పారు. తెలంగాణలో కూటమి అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రభుత్వ ఎజెండా కమిటీకి కోదండరాం ఛైర్మన్ గా ఉంటారని ఎల్ రమణ చెప్పారు. తెలంగాణలో అనుకోకుండా కూటమి ఏర్పాటైందని అన్నారు. కానీ ప్రకంపణలు సృష్టించే దిశగా కూటమి సాగుతున్నట్లు చెప్పారు. వార్ వన్ సైడ్ అన్న టిఆర్ఎస్ కు వనుకు పుట్టిందని కామెంట్ చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న ప్రభుత్వంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. సీటు రాలేని  కారణంగా ఎవరైనా ఇబ్బంది పడినా వారందరికీ రానున్న ప్రభుత్వంలో తగిన గౌరవం దక్కుతుందని చెప్పారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయాన్ని నోటిఫికేషన్ కంటే ముందే చెబుతామన్నారు. మోదీ కేసిఆర్ కుమ్మక్కై ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. వారిద్దరి మోసం పార్లమెంటు ఎన్నికల సమయంలో తేలిపోతదని విమర్శించారు. 

ఈ భేటీలో కూటమిలో ఉన్న సిపిఐ పార్టీ నేతలు హాజరు కాలేదు. అంతకంటే ముందు సిపిఐ నేతలతో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. 

మొత్తానికి మహా కూటమి మహా టెన్షన్ మరింత కాలం కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. అసంతృప్తు్లు, అసమ్మతి నేతల తాకిడిని తట్టుకునేందుకే ఇంకా సీట్ల, క్యాండెట్ల సస్పెన్స్ కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.