నిజామాబాద్ మధు యాష్కీ గౌడ్ భువనగిరి కి షిప్ట్ ??

నిజామాబాద్ జిల్లాలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న మదు యాష్కీ గౌడ్ రూట్ మార్చనున్నారా? ఆయన రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ లో కాకుండా భువనగిరిలో పోటీ చేయబోతున్నారా? యాష్కీ చూపు భువనగిరి వైపు ఎందుకు మళ్లింది? ఈ కొత్త స్కెచ్ వెనుక ఉన్న వ్యూహమేంది? చదవండి.

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు మధు యాష్కీగౌడ్ పనిచేశారు. 2004లో నిజామాబాద్ పార్లమెంటు బరిలోకి దిగిన మధు యాష్కీ అప్పుడు టిడిపి అభ్యర్థి యూసుఫ్ అలీపై 1,37,871 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తర్వాత 2009లోనూ టిఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్త బీగాల మీద 60,390 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కేసిఆర్ కుమార్తె కవిత చేతిలో 1,67,184 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో మధు యాష్కీ గౌడ్ నిజామాబాద్ నుంచి కాకుండా భువనగిరి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దానికి అనేక కారణాలున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో మధు యాష్కీ క్రియాశీల పాత్ర పోశించారు. వైఎస్ సిఎం గా ఉన్న రోజుల్లోనూ తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించిన చరిత్ర మధు యాష్కీ కి ఉంది. రాహుల్ గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల మధు యాష్కీ అప్పటి సిఎం వైఎస్ కు బెదరకుండా తెలంగాణ వాదం వినిపించారు. తెలంగాణ పోరాటంలో తన వంతు పాత్ర పోశించారు. జాతీయ స్థాయిలో ఆయనకు కాంగ్రెస్ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఎఐసిసి కార్యదర్శిగా, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. మొన్నటికి మొన్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ జెడిఎస్ కూటమి కలపడంలో, క్యాంపు నడపడంలో, కాంగ్రెస్, జెడిఎస్ సర్కారు కొలువుదీరడంలో యాష్కీ కీ రోల్ ప్లే చేశారు.

2014 నుంచి మధు యాష్కీ గౌడ్ నిజామాబాద్ రాజకీయాలను పట్టించువడంలేదన్న ప్రచారం ఉంది. ఆయన నిజామాబాద్ కు చుట్టపు చూగానే వెళ్తున్నట్లు చెబుతున్నారు. మొన్నటివరకు కర్ణాటక ఎన్నికల హడావిడి ఉంది కాబట్టి రాలేదని ఆయన అనుచరులు చెప్పుకొచ్చారు. అయినా ఇంకా నిజామాబాద్ పట్ల యాష్కీ ఆసక్తి చూపడంలేదన్న ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో సాగుతోంది. మధు యాష్కీ సొంత ఊరు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోని హయత్ నగర్. ఆయన ఊరు భువనగిరి పార్లమెంటుకు వస్తుంది. దీంతో ఈసారి మధు యాష్కీ భువనగిరి పార్లమెంటుకు పోటీ చేయవచ్చని జోరుగా టాక్ వినబడుతోంది. అందుకోసమే మధు యాష్కీ నిజామాబాద్ పాలిటిక్స్ లో సీరియస్ గా ఉండడంలేదని అంటున్నారు.

మధు యాష్కీ నిజామాబాద్ వీడతారనడానికి అనేక కారణాలున్నాయి. సిఎం కుమార్తె కవిత నిజామాబాద్ లో స్ట్రాంగ్ క్యాండిడెట్ గా తయారయ్యారు. ఆమెను రానున్న ఎన్నికల్లో ఆమెను ఢీకొట్టడమంటే సిఎంను ఢీకొట్టడమే అన్న ప్రచారం ఉంది. అంతకుముందు రెండు పర్యాయాలు మధు యాష్కీ విజయం సాధించినప్పటికీ కవిత చేతిలో లక్షా 67వేల తేడాతో ఓడిపోయారు. అయితే ఎన్నికలు ముగిసి నాలుగేళ్లు అయినప్పటికీ నిజామాబాద్ పాలిటిక్స్ కు మధు దూరంగానే ఉన్నారు. నిజామాబాద్ ను వదిలేయడం కోసమే ఆయన అక్కడ హడావిడి చేయడంలేదని చెబుతున్నారు. అంతేకాకుండా మధు యాష్కీ తెలంగాణ రాజకీయాల్లో బలమైన బిసి నేతగా ముద్ర పడ్డారు. గౌడ్ సామాజివర్గంలోనే కాకుండా ఆయన బిసి కులాల వారితో సత్సంబంధాలున్నాయి. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్ లో ఒకవైపు కవిత పోటీ చేస్తుండగా మరోవైపు బిజెపి నుంచి డి శ్రీనివాస్ కొడుకు ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ధర్మపురి అర్వింద్ బిసి నేతగా యాష్కీ ఓట్లకు గండికొట్టే ప్రమాదముందని భావిస్తున్నారు. ఇద్దరు బిసి అభ్యర్థులు ఓట్లను చీల్చుకుంటే కవిత సునాయాసంగా గట్టేక్కే చాన్స్ ఉంటుదని భావిస్తున్నారు.

ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎంపిగా తన సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. మరి ఆయన మీద పోటీ చేస్తారా అన్న ప్రశ్న కూడా ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న మాట ఏమంటే? బూర నర్సయ్య గౌడ్ ఈసారి ఎంపీగా పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. ఆయన అసెంబ్లీకి పోటీ చేసే చాన్స్ ఉందంటున్నారు. బూర నర్సయ్య ఖైరతాబాద్ కానీ, లేదంటే ఆలేరు సీటులో పోటీ చేయవచ్చని అంటున్నారు. బూర నర్సయ్య గౌడ్ పార్లమెంటుకు బరిలో లేకుంటేనే మధు యాష్కీ గౌడ్ భువనగిరిలో పోటీ చేయవచ్చు అని నల్లగొండకు చెందిన ఒక గౌడ నేత ఒకరు తెలిపారు. రానున్న ఎన్నికల్లో తాను పార్లమెంటుకే పోటీ చేస్తానని యాష్కీ ఇటీవల తన మనసులో మాట బయటపెట్టారు. ఇప్పటికే భువనగిరిలో రెండుసార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తరా? ఎంపిగా అన్నది ఇంకా తేలలేదు. ఈ స్థితిలో కోమటిరెడ్డి సోదరులు యాష్కీని స్వాగతిస్తారా అన్నది కూడా చర్చనీయాంశమైంది.