మునుగోడు నియోజకవర్గం ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బు పంపిణీ జరుగుతుండటంతో మునుగోడు నియోజకవర్గ ఓటర్లు సంతోషిస్తున్నారు. దేశంలోని ఖరీదైన ఉపఎన్నిక అయిన మునుగోడులో గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే అధికార పార్టీల నేతలు చేస్తున్న కొన్ని కామెంట్లు మాత్రం మైనస్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మునుగోడుకు 18,000 కోట్ల రూపాయల నిధులు ఇస్తే మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటామని కేటీఆర్ కామెంట్లు చేశారు. తెలంగాణ మంత్రులు సైతం ఇదే విషయం చెబుతున్నారు. అయితే ఒక నియోజకవర్గం కోసం కేంద్రం ఈ స్థాయిలో నిధులు ఇవ్వడం సాధ్యం కాదు. మరోవైపు నిధులు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని కేటీఆర్ స్థాయి నేతలు చేసే కామెంట్లు ఓటర్లకు నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగిస్తాయి.
ఒక విధంగా అధికార పార్టీ వెనుకడుగు వేస్తుందనే సంకేతాలను కేటీఆర్ పంపుతున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరోవైపు హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బు పట్టుబడుతుండగా ఆ డబ్బు బీజేపీకి చెందిన డబ్బేనని సమాచారం అందుతోంది. మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఇతర నియోజకవర్గాల ప్రజల దృష్టి కూడా ఈ నియోజకవర్గంపై ఉండే ఛాన్స్ ఉంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఈ ఉపఎన్నిక విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ప్రకటించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మునుగోడు ఉపఎన్నిక ఫలితం వ్యతిరేకంగా వస్తే టీ.ఆర్.ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఖర్చు మాత్రం అంచనాలకు మించి ఉందని సమాచారం అందుతోంది.