తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ, అసెంబ్లీ పరిసరాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, అదానీ మధ్య స్నేహం ఉందని ఆరోపిస్తూ టీ షర్ట్‌లు ధరించి సభలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు ఆపడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది.
టీ షర్ట్‌లు ధరించి సభలోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారు అసెంబ్లీ గేట్ ఎదుటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతిపక్షం లేకుండానే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడి చర్చలకు దారితీశాయి. బీఆర్ఎస్ నిరసనలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెంచాయి. మరి రేవంత్ ఈ పరిస్థితిపై ఏ విదంగా స్పందిస్తారో చూడాలి.