చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనకు ఫోన్ చేసి కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని కోరినట్లు చేసిన ఆరోపణలను కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. మర్రి జనార్దన్ రెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడం తప్పు అని మండిపడ్డారు. తనకు మర్రి జనార్దన్ రెడ్డే ఫోన్ చేశాడని, పైగా ఉల్టా తన మీద ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా ఏమన్నారో కింద చదవండి.
నేను మర్రి జనార్దన్ రెడ్డికి కాల్ చేశాను. ఫోన్ లో ఎలా ఉంది పరిస్థితి అని అడిగాను. నాగర్ కర్నూల్ లో ఎలా ఉందని అడిగాను. బాగుంది.. నేనే గెలుస్తాను అన్నాడు. మీదగగ్గర ఎట్లుందని అన్నాడు. మా దగ్గర బాగుందని నేను చెప్పాను. పాలమూరులో ఎంతమంది గెలుస్తారని అడిగాను. ఆయన 14లో 11 గెలుస్తామని చెప్పాడు.
కానీ సాధారణంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా వాట్సాప్ లో మాట్లాడతారు. ఒకరిద్దరే ఫోన్ లో మాట్లాడతారు. వారంతా భయంతో ఉన్నారు. వాళ్ల ఫోన్లపై నిఘా ఉంది. అందుకే వాట్సాప్ లోనే మాట్లాడతారు. నేను కాల్ చేసిన తర్వాత కొద్దిసేపటికి మర్రి జనార్దన్ రెడ్డి నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. ఇవాళ 2.19 గంటలకు మర్రి జనార్దన్ రెడ్డి అన్నా ఐ విల్ కాల్ యూ అని మెసేజ్ పెట్టిండు. తర్వాత ఆయనే నాకు వాట్సాప్ కాల్ చేసిండు. నేను ఆయనకు ఫోన్ చేసిన సమయంలో ఆయన పక్కన ఎవరైనా ఉండి ఉండవచ్చు. అందుకే ఆయన మామూలుగా మాట్లాడి మెసేజ్ పెట్టిండు అని అనుకున్న. ఆయన ఫోన్ మీద నిఘా ఉండబట్టి తర్వాత వాట్సాప్ లో రెస్పాన్డ్ కావొచ్చు కదా?
తర్వాత ఆయనే వాట్సాప్ కాల్ చేసి మా దగ్గర 14లో 11 గెలుస్తారు అని చెప్పాడు. వాట్సాప్ లో రికార్డింగ్స్ ఉండవు. తర్వాత ఆయన కావాలని వాట్సాప్ కాల్ చేసిండు. అయినా వాట్సాప్ కాల్ కూడా స్పీకర్ ఆన్ చేసిన తర్వాత వేరే ఫోన్ తో రికార్డింగ్ చేయవచ్చు కదా? దమ్ముంటే ఆయన ఫోన్ రికార్డింగ్స్ బయట పెట్టాలి.
అయినా టిఆర్ఎస్ వారు ఇంత దిగజారి ఉన్నరా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఎమ్మెల్యే అమ్ముడు పోతడా? తప్పకుండా ఫోన్ చేస్తా. ఇంకా పది మందికి ఫోన్ చేస్తా. అయినా నేను ఆయనను కొనలేస్తనా? ఆయన కోటీశ్వరుడు. ఆయనకు పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. ఆయనకు ఓడిపోతాడని భయం ఉండొచ్చు.
అవతలి నుంచి గెలిచి ఇవతలికి జంప్ చేయడంలో టిఆర్ఎస్ కు ఉన్న నైపుణ్యం ఇంకా ఎవరికి ఉంది. వారు 63 మంది గెలిచి 90కి పైగా చేర్పించుకున్నరు. ఆయనకు నేను బరాబర్ ఫోన్ చేస్తా. తప్పకుండా ఫోన్ చేస్తా. మా ఇంటికి ఆయన డిన్నర్ కు కూడా వచ్చిండు. నేను వాళ్ల ఇంటికి పోయినా. అయినా నేను మల్లా మీముందే (మీడియా ముందే) ఫోన్ చేస్తున్నా చూడండి. ఇగో చూడండి. ఫోన్ చేస్తున్నాను. స్పీకర్ కూడా ఆన్ చేస్తాను. మిత్రమా (మర్రి) టెన్షన్ పడకు. నాగర్ కర్నూల్ లో టైట్ నడుస్తున్నది. పైసలతో గెలిచే అవకాశం లేదు. నీకు గెలిచే అవకాశం లేదు. టైట్ నడుస్తున్నది. జర ఫోన్ తియ్యి జనార్దన్ రెడ్డి బాయి సాబ్. (జనార్దన్ రెడ్డికి కాల్ చేశాడు కొండా)
నేను ప్రలోభ పెడితే రికార్డింగ్ చేసి బయట పెట్టొచ్చు కదా? ఇవాళ రేపు చిన్న పిల్లలకు కూడా టెక్నాలజీ తెలుసు. ఎన్నికలు టైట్ గా నడుస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎన్నో వచ్చాయి. కానీ చాలావరకు తప్పుడు పోల్స్. సి ఓటర్, లగడపాటి పోల్స్ పక్కాగా ఉంటాయి. నేను వాటినే నమ్ముతున్నాను. టిఆర్ఎస్ పెద్దలు కూడా అదే నమ్ముతున్నారు. అందుకే టెన్షన్ తో వారు బిజెపి, ఎంఐఎం నేతలతో పొత్తులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఒక్కసారికి వదిలిపెడుతున్నాను. మల్లా నా మీద మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావా వేస్తా. రేపు రిజట్ల్స్ తర్వాత నేను మళ్లీ స్పందిస్తాను. నా ఫోన్ నెంబరు టివిల్లో పెట్టిండు జనార్దన్ రెడ్డి. నా ఫోన్ నెంబరు జనాలకు చెప్పడంతో నాకు కంటిన్యూగా ఫోన్లు వస్తున్నాయి.
మర్రి జనార్దన్ రెడ్డి ఫోన్ నెంబర్లు 9030899999, 9000444777 ఈ రెండు నెంబర్లను కూడా నేను మీడియాకు వెల్లడిస్తున్నాను. నా నెంబరు జనాలకు చెప్పడంతో ఫోన్లు వస్తున్నాయి. అందుకే ఆయన నెంబరు జనాలకు చేరవేస్తున్నాను. ఇలా నా నెంబరు మీడియాలో పెట్టడం తప్పు కదా? తెలంగాణలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే చాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.