నువ్వొక బచ్చా గానివి : కొండా సురేఖ ఫైర్

వరంగల్ నగరంలో అధికార టిఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో వర్గ విబేధాలు ముదిరి పాకాన పడ్డాయి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఇటీవల కాలంలో వివాదాల్లో నలుగుతున్నారు. సురేఖ వర్సెస్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ మధ్య రోజురోజుకూ పంచాయితీ తీవ్రమవుతున్నది. ఏ చాన్స్ దొరికినా ఒకరినొకరు తొక్కిపారేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టిఆర్ఎస్ అధిష్టాన పెద్దల అండదండలు పుష్కలంగా ఉండడంతో ప్రస్తుతం మేయర్ వర్గం వరంగల్ నగరంలో జూలు విదిల్చి తిరుగుతోంది. కొండా దంపతులకు పొగపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.  అధిష్టానం వద్ద పలుకుబడి తగ్గడంతో సురేఖ వర్గం కొద్దిగా ఇరకాటంలో పడింది అన్న ప్రచారం సాగుతోంది. మహ్మద్ ఇక్బాల్ మినార్ నిర్మాణం వ్యవహారం అధికార పార్టీలో రాజకీయ రంగు పులుముకున్నది. మేయర్ పై ఆగ్రహాన్ని వెల్లగక్కారు కొండా సురేఖ. చంద్రబాబే మాఫ్యామిలీని ఏం చేయలేకపోయాడంటూ ఫైర్ అయ్యారు.

సారే జహాసే అచ్చా.. అనే గేయ రచయిత మహ్మద్ ఇక్బాల్ పేరుతో వరంగల్ నగరంలో ఒక మినార్ ఉండేది. అది శిథిలావస్థకు చేరడంతో దాన్ని పునర్ణిర్మాణం చేస్తున్నారు. కానీ నిర్మాణం అవుతున్న మినార్ ను మేయర్ వర్గం కూల్చి వేశారని సురేఖ వర్గం ఆరోపిస్తోంది. మినార్ పనులు ఆపేసి దాన్ని కూల్చి వేయడంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది. ముస్లిం మైనార్టీలో మినార్ నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ మెరుపు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొండా సురేఖ అక్కడికి చేరుకుని వారి ధర్నాలో పాల్గొన్నారు. మేయర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే అధికారులు, పోలీసులు నచ్చచెప్పడంతో కొండా సురేఖ దగ్గరుండి ఆందోళనను విరమింపజేశారు.

ఈ సందర్భంగా కొండా సురేఖ మేయర్ మీద నిప్పులు చెరిగారు. ‘‘మేయర్ నరేందర్.. నువ్వొక బచ్చాగాడివి.. కొండా దంపతులను చంద్రబాబే ఏమీ చేయలేకపోయిండు.. నీవల్ల ఏమైతది? ఇప్పటికైనా చెప్తున్న చిల్లర రాజకీయాలు బందు చేసి అభివృద్ధి కోసం పనిచెయ్యి’’ అని నిప్పులు చెరిగారు. గొప్ప వ్యక్తి పేరిట నిర్మాణం చేపడుతున్న మినార్ ను మేయర్ కూల్చివేయడం సరికాదన్నారు.

గత కొంతకాలంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యేను నేనే అంటూ మేయర్ ప్రచారం చేసుకుంటున్నాడని సురేఖ ఆరోపించారు. ‘‘ఎవరు ఎమ్మెల్యే అవుతారో? ఎవరికి టికెట్ వస్తుందో? ఎవరు గెలుస్తారో’’ అన్నది కేసిఆర్ నిర్ణయిస్తారని అన్నారు. మేయర్ అలా తమను చిన్నబుచ్చే విధంగా ప్రచారం చేసుకుంటన్నప్పటికీ తాము ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. నిజంగానే మైనార్టీలంతా రోడ్డు మీద కూర్చుని ధర్నా చేసిన సమయంలో తాము కనుసైగ చేసి ఉంటే.. క్షణాల్లో మేయర్ ఇల్లు నేలమట్టం అయ్యేదని అన్నారు. కానీ.. తాము ఆ పనిచేయకుండా ఆందోళన చేస్తున్నవారిని సముదాయించి ధర్నా విరమింపజేశామన్నారు.

మొత్తానికి మేయర్ వర్సెస్ సురేఖ వార్ మరింత ముదిరేలా ఉందని చెబుతున్నారు. అయితే సురేఖ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం నేపథ్యంలో మేయర్  నన్నపనేని నరేందర్ వర్గం కొండా దంపతులపై తీవ్రమైన విమర్శలకు దిగుతున్నది. కొండా ఫ్యామిలీని చిన్నబుచ్చేలా వ్యవహరిస్తున్నారని, దాన్ని కొండా ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతున్నదని అంటున్నారు. మొత్తానికి వరంగల్ పాలిటిక్స్ లో కొండా సురేఖ, మేయర్ మధ్య వైరం హాట్ టాపిక్ అయింది.

ముస్లింలకు ఆందోళనకు మద్దుగా కొండా సురేఖ ధర్నాలో కూర్చున్న వీడియో కింద ఉంది.