తెలంగాణలో హాట్ హాట్ నియోజకవర్గాల జాబితాలో కొడంగల్ అనేది టాప్ లో ఉంటుంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పేర్లు అందరికీ తెలియకపోవచ్చు కానీ కొడంగల్ ఎమ్మెల్యే ఎవరంటే రేవంత్ రెడ్డి అని ఠక్కున చెబుతారు. 2019 ఎన్నికల్లో కొడంగల్ లో ఎవరు గెలుస్తారు? పోటీ ఎవరి మధ్య ఉంటుంది? ఎవరు ఓడిపోతారు? డిపాజిట్లు దక్కేది ఎవరికి? డిపాజిట్లు గల్లంతయ్యేది ఎవరికి? ఇలా రకరకాల చర్చలు కొడంగల్ చుట్టూ బాగానే నడుస్తున్నాయి. ఇప్పటికే కొడంగల్ లో ఎవరు గెలుస్తారని పలు రకాల సర్వేలు కూడా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో కొడంగల్ లో పట్టు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
టిడిపిలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచే పోటీ చేయనున్నారు. ఇక అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపే చాన్స్ ఉందుంటన్నారు. ఇక ఈ పరిస్థితుల్లో మిగతా రాజకీయ పార్టీలైన బిజెపి, తెలంగాణ జన సమితి పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నాయి. అయితే కొడంగల్ లో పార్టీ అభ్యర్థి వేటలో పడ్డారు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండబోదని ప్రకటించిన కోదండరాం అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారు. కొడంగల్ లో బలమైన అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. కొడంగల్ లో ఇప్పటికే కొందరి పేర్లు కోదండరాం పరిశీలించినట్లు వార్తలొస్తున్నాయి.
కొడంగల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి మంచి పట్టుంది. ఆయన సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. రానున ఎన్నికల్లో ఆయనకు టిఆర్ఎస్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరారు. ఆయనకు టిఆర్ఎస్ టికెట్ రాదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో కొడంగల్ నుంచి ఆయన కుటుంబసభ్యులను తెలంగాణ జన సమితిలో చేర్చుకుని టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో తెలంగాణ జన సమితి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే తాజాగా తెలంగాణ జన సమితి నేతలు గుర్నాథ్ రెడ్డి అన్న కూతురు అయిన అనితా రెడ్డి (ఆనం రెడ్డి)ని సంప్రదించారు. ఆమె ఇటీవల కాలంలో కొడంగల్ లో బాగా పాపులర్ అయ్యారు. తన బాబాయి గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరినా తాను మాత్రం టిఆర్ఎస్ తో పనిచేయలేనని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు.
అంతేకాదు రేవంత్ రెడ్డి ఇంటికొచ్చి ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రేవంత్ తో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆమె రేవంత్ కు మద్దతు ప్రకటించిన సమయంలో ఈ పరిణామం పెద్ద సంచలనమైంది. అయితే ఇటీవల కాలంలో ఆమె కొడంగల్ లో సైలెంట్ అయ్యారు. తన అత్తగారిల్లైన గుల్బర్గాలోనే ఉంటున్నారు. కొడంగల్ కు గతంలో వచ్చినట్లుగా రావడంలేదు. ఆమె రేవంత్ కు మద్దతు తెలిపే వరకు కొడంగల్ లో పోటీ చేయాలన్న తలంపుతో ఉన్నారు. కానీ తన బాబాయి పోటీ చేస్తే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు చేస్తే బాగుండదని భావించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి తన బాబాయికి టికెట్ రాదని తెలిసి పోయింది కాబట్టి ఆమె పోటీ చేయవచ్చేమో అన్న ప్రచారం ఉంది. ఆమెను టిజెఎస్ లోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆమెను తెలంగాణ జన సమితి నేతలు కాంటాక్ట్ చేశారు.
ఇటీవల కాలంలో అనితారెడ్డి తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితిలో చేరాలంటూ జన సమితి నుంచి ఆమెను ఆహ్వానించారు. పార్టీలో చేరితే కొడంగల్ టికెట్ ఇస్తామని ఆమెకు ఆఫర్ చేసినట్లు తెలిసింది. దీనికి ఆమె ఔనని కానీ, కాదని కానీ ఎలాంటి జవాబు చెప్పలేదని తెలిసింది. తమ కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని ఆమె వివరణ ఇచ్చారు. తెలంగాణతోపాటు తన భర్త వైపు కర్ణాకటలోనూ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఆమె తెలిపారని సమాచారం. ఈ పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీని వీడాలా లేదా అన్న విషయంలో ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదని ఆమె ‘తెలుగు రాజ్యం’ కు చెప్పారు. పాలిటిక్స్ లో యాక్టీవ్ గా పనిచేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు ఆమె తెలిపారు. 2019లో పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణ జన సమితిలో చేరాలని ఆహ్వానం అందిన విషయం వాస్తవమేనని ధృవీకరించారు.
కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గత నాలుగున్నరేళ్ల కాలంలో ఎప్పుడు చూసినా వార్తల్లో నానుతూ ఉన్నారు. కొడంగల్ వల్ల రేవంత్ కు వచ్చిన పేరు కంటే రేవంత్ వల్ల కొడంగల్ కు వచ్చిన పేరే ఎక్కువ. ఆయన టిడిపిలో ఉన్నా, కాంగ్రెస్ లో చేరినా నిత్య వివాదాలతో పబ్లిక్ చర్చలో ఉంటున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయి జైలుకు పోయిన సందర్భంలో రేవంత్ నేషనల్ మీడియాలో కూడా మారు మోగిపోయారు. డబ్బులిస్తున్న వీడియోలు దేశమంతా ప్రసారమయ్యాయి. ‘‘రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం.. జైలుకు పంపినం.. ఇగ రేవంత్ పని అయిపోయింది’’ అని టిఆర్ఎస్ సంబర పడ్డది. కానీ ఆ సంబరాలు మూన్నాళ్ల ముచ్చటగానే అయిపోయాయి. ఎందుకంటే జైలుకు పోయి వచ్చిన తర్వాత రేవంత్ భాష, యాస ఒక్కసారిగా మారిపోయాయి. అధికార పార్టీ నేతలను ముఖ్యంగా సిఎం కుటుంబంపై విరుచుకుపడుతున్నారు. కేసిఆర్ కుటుంబసభ్యుల గుట్టు బయట పెడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
కేటిఆర్ మామ తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. కేటిఆర్ బామ్మార్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు గుప్పించారు. ఇలా నిత్యం ఏదో ఒక వివాదాన్ని రగలించడం ద్వారా అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా రేవంత్ ను ఖతం చేయాలని అధికార పార్టీ గట్టి పట్టు పట్టింది. పెద్ద సంఖ్యలో మంత్రులు, నేతలు కొడంగల్ లో హల్ చల్ చేస్తున్నారు. నిధుల వరద పారించే పనిలో ఉన్నారు. మొన్నటికి మొన్న టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు కూడా కొడంగల్ లో పర్యటించి హల్ చల్ చేశారు. అంతేకాదు టిఆర్ఎస్ చేయించిన సర్వేలన్నీ రేవంతే గెలుస్తాడని వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఎలాగైనా రేవంత్ ను ఓడించాలంటూ కేటిఆర్ వికారాబాద్ జిల్లా నేతలను ఆదేశించినట్లు కూడా వార్తలొచ్చాయి.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ జన సమితి కి కూడా బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాల్లో ఉన్నారు.