అప్పుడు ముద్దైనది.. ఇప్పుడు చేదవుతున్నది.! ఔను, 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఈసారి మాత్రం ముందస్తు ఎన్నికలకు ‘నో’ అంటున్నారు. నిజానికి, కేసీయార్ నుంచే ముందస్తు ఎన్నికలపై లీకులు వచ్చాయ్.! ఆ తర్వాత ఆయనే ముందస్తుకు ‘ససేమిరా’ అంటున్నారు. తాజాగా, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీయార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదు. షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతాయ్. పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధంగా వుండాలి. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. బీజేపీ వ్యూహాల్ని తిప్పి కొట్టాలి..’ అంటూ పార్టీ ముఖ్య నేతలకు పిలుపునిచ్చారు.
అంతే కాదు, ఎమ్మెల్యేలెవర్నీ మార్చబోరట. సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ టిక్కెట్లు ఇస్తామని కేసీయార్ ప్రకటించేశారు. 2018 ఎన్నికలకంటే గొప్ప విజయాన్ని 2023లో సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు కేసీయార్. ‘అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మనకు తిరుగే లేదు. అవే మనల్ని మళ్ళీ గెలిపిస్తాయ్..’ అని పార్టీ నేతలతో చెప్పారు కేసీయార్.’బీజేపీ తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదు. ఈడీని ప్రయోగించినా, సీబీఐని ప్రయోగించినా బీజేపీ జిమ్మిక్కుల్ని తిప్పికొట్టగల సామర్థ్యం తెలంగాణకు వుంది.. మునుగోడులో ఎలాగైతే సమిష్టిగా పనిచేసి విజయం సాధించామో, అంతకు మించిన పక్కా ప్రణాళికతో వచ్చే ఎన్నికలకు సిద్ధమవ్వాలి..’ అని కేసీయార్, పార్టీ శ్రేణులకు సూచించారు.
‘నా కుమార్తెనూ బీజేపీలోకి లాగెయ్యాలని చూశారు.. ఎమ్మెల్యేలెవరూ బీజేపీ వలకు చిక్కలేదు. అది తెలంగాణ పట్ల వారికి వున్న నిబద్ధత..’ అంటూ కేసీయార్ చెప్పుకొచ్చారట. ఔనా, కవితకి సైతం బీజేపీ గాలం వేసిందా.? అసలు అలా జరుగుతుందా.? అన్న చర్చ షురూ అయ్యింది తెలంగాణలో. భారత్ రాష్ట్ర సమితి అన్నారు.. ముందస్తు ఎన్నికలన్నారు.? మరి, ఇంతలోనే ఏమయ్యింది.? ముందస్తుపై కేసీయార్ ఎందుకు రివర్స్ గేర్ వేసినట్టు.?